కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంతో వైద్యం: వందేళ్ల నాటి విధానంతో అమెరికాలో ప్రయోగం

By Siva KodatiFirst Published Apr 2, 2020, 5:38 PM IST
Highlights

కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ఫ్లాస్మాను వేరు చేసి దానిని కోవిడ్‌తో బాధపడుతున్న వారికి చికిత్స చేసేందుకు ఉపయోగించనున్నారు. ఎన్జీవో సంస్థ ఏఏబీబీ కోవిడ్ చికిత్స కోసం ట్రాన్స్‌‌ఫ్యూజన్ మెడిసిన్, సెల్యూలర్ థెరపీలపై ఈ సంస్థ దృష్టి సారించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. దీని బారినపడి ఇప్పటికే 40 వేలకు మందికి పైగా మరణించగా 9 లక్షల మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ను కనిపెట్టాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలో అమెరికా వ్యాప్తంగా రక్తదాన కేంద్రాలు ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ఫ్లాస్మాను వేరు చేసి దానిని కోవిడ్‌తో బాధపడుతున్న వారికి చికిత్స చేసేందుకు ఉపయోగించనున్నారు.

Also Read:కరోనా నుంచి కోలుకున్న రోగుల రక్తంతో వ్యాక్సిన్...?

ఎన్జీవో సంస్థ ఏఏబీబీ కోవిడ్ చికిత్స కోసం ట్రాన్స్‌‌ఫ్యూజన్ మెడిసిన్, సెల్యూలర్ థెరపీలపై దృష్టి సారించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ఆధారంగా అమెరికాలో డజన్ల కొద్దీ బ్లడ్ సెంటర్లు కోవిడ్‌ 19 నుంచి కోలుకున్న వారి నుంచి ఫ్లాస్మాను సేకరిస్తున్నాయి.

1918లో ప్రపంచాన్ని వణికించిన ఫ్లూ, 1930లలో మీజిల్స్ చికిత్సకు నాటి వైద్యులు ఇదే విధానాన్ని అవలంభించారు. ఇటీవలి సంవత్సరాల్లో ఎబోలా, సార్స్, హెచ్1ఎన్1‌ బాధితులకు చికిత్సను అందించడానికి ఫ్లాస్మా థెరపీని ఉపయోగించారు.

దీనికి తోడు ఇటీవలి అధ్యయనాలు సైతం ఫ్లాస్మా వాడకం ద్వారా వైరస్‌ల వ్యాప్తిని, మరణాలను కొంతవరకు అదుపు చేయడానికి సహాయపడతాయని చెబుతున్నాయి. అయితే క్లినికల్ ట్రయల్స్‌‌లో మాత్రం దీని సామర్ధ్యం ఇంకా అధికారికంగా రుజువు కాలేదు.

Also Read:కరోనా ఎఫెక్ట్: షాంజైన్‌లో కుక్కలు, పిల్లుల పెంపకంపై బ్యాన్

అయితే కోవిడ్ 19 వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చికిత్స, వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రానందువల్ల  ఈ విధానంలో ఎటువంటి హానీ లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో కరోనా రోగుల ప్రాణాలు నిలబెట్టడానికి ఫ్లాస్మాను ఉపయోగించేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అమెరికాలో లక్ష దాటగా 5,119 మంది మరణించారు. ఇటలీలో 13,155, స్పెయిన్‌లో 9,053, చైనాలో 3,312 మరణాలు నమోదయ్యాయి. 
 

click me!