కరోనా దెబ్బ: మీ వాహనం మూడు కి.మీ. దాటితే ఫైన్, డీజీపీ వార్నింగ్

By narsimha lodeFirst Published Mar 26, 2020, 4:08 PM IST
Highlights

కరోనాను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ప్రజలు రోడ్లపైకి రాకుండా ఉండేందుకు తెలంగాణ పోలీసులు కీలక చర్యలు తీసుకొన్నారు

హైదరాబాద్:కరోనాను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ప్రజలు రోడ్లపైకి రాకుండా ఉండేందుకు తెలంగాణ పోలీసులు కీలక చర్యలు తీసుకొన్నారు. రోడ్డుపైకి వచ్చిన వాహనం మూడు కిలోమీటర్లు దాటితే ఆటోమెటిక్ గా ఫైన్ కట్టాలంటూ ఇంటికే నేరుగా పోలీసులు నోటీసులు పంపనున్నారు.

కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ విధిసూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని మోడీ సూచించారు.

Also read:ఎన్ఓసీల నిలిపివేత, అలా చేస్తే కేసులు: ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులతో తలసాని మీటింగ్

తాము నివాసం ఉంటున్న ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే నిత్యావసర సరుకులను తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ సూచించింది.
అయితే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చే వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు తెలంగాణ పోలీస్ శాఖ మరికొన్ని చర్యలు తీసుకొంది.

బైక్ లు లేదా కార్లు ఒక్క పాయింట్ నుండి మూడు కిలోమీటర్ల దూరం దాటితే రోడ్లపై ఉన్న సీసీకెమెరాలు రికార్డు చేస్తాయి. ఆయా వాహనాల నెంబర్ల ఆధారంగా వాహన యజమానికి జరిమానా చెల్లించాలని నోటీసులు పంపనున్నారు.

పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తారు. లాక్ డౌన్ ను పురస్కరించుకొని నిత్యావసర సరుకులు తెచ్చుకొనేందుకు ప్రతి ఇంట్లో ఒక్కరికి బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం నిర్ధేశించిన పద్దతుల్లోనే నిత్యావసర సరుకులను తెచ్చుకోవాలని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. 

ఇందులో బాగంగానే   ప్రభుత్వం  కొన్ని విషయాల్లో కఠినంగా ఉంది. రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించే సమయంలో అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టంగానే ఆదేశాలు జారీ చేశారు..అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దింపుతామని ప్రజలను  హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాటికి కరోనా పాజటివ్ కేసులు 44కు చేరుకొన్నాయి. రోజు రోజుకు కరోనా పాజిటివ్ లక్షణాలు రాష్ట్రంలో పెరిగిపోవడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.


 

click me!