లాక్ డౌన్ ఎఫెక్ట్: పిల్లాపాపలతో కాలిబాటన సొంతూర్లకు...మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

By Arun Kumar P  |  First Published Mar 26, 2020, 3:44 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్న  నిరుపేదలకు తనవంతు సాయం చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. 


హైదరాబాద్: అతి భయంకరమైన కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ  ప్రమాదకరంగా మారుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా జనతా కర్ప్యూ తర్వాతి రోజు నుండే తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో సొంతూర్లకు వెళదామనుకున్న చాలామంది నిరుపేదలు, కూలీలు హైదరాబాద్ లోనే చిక్కుకుపోయారు. రెక్కాడితే గాని  డొక్కాడని నిరుపేదలు హైదరాబాద్ లో ఖాళీగా కూర్చుని తినే పరిస్థితి లేదు అలాగని సొంతూళ్లకు వెళ్లడానికి రవాణా సదుపాయం లేదు. దీంతో దిక్కుతోచని కొందరు పిల్లాపాపలతో వందల కిలోమీటర్లు నడవడానికి సిద్దపడ్డారు.  

ఇలా సంగారెడ్డి  జిల్లాలోని చౌటకుర్ జాతీయ రహదారి ప్రక్కన కొందరు జనాలు చిన్న పిల్లలతో సహా నడుచుకుంటూ వెళ్లడాన్ని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గమనించారు.  దీంతో వెంటనే తన వాహనాన్ని ఆపిన ఆయన వారి గురించి ఆరా తీశారు. 

Latest Videos

"మేము హైద్రాబాద్ నుంచి నాయణఖేడ్ పరిధిలోని గ్రామాలకు వెళ్ళాలి సర్. రవాణా సౌకర్యం లేక రెండు రోజులుగా ఇలా కాలి నడకన వెళ్తున్నాం. నిన్న ఉదయం నుంచి నడుచుకుంటూ పోతున్నాం. మాకు ఆహారానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సర్"  అని వారు తమ బాధను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో చలించిపోయిన క్రాంతి కిరణ్ మానవత దృక్పదంతో వెంటనే స్థానిక పోలీసుల సహకారంతో వాళ్ళు సొంతూళ్లకు వెళ్లడానికి వాహనాన్ని  సమకూర్చారు.   అలాగే జోగిపేటలో వారికి భోజన ఏర్పాట్లు చేసి వారి స్వగ్రామాలకు పంపించారు. 

ఈ క్రమంలో ఆయన రహదారి మీదున్న గ్రామాల ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్న వారికి మానవతా దృక్పధంతో ఆశ్రయం ఇవ్వడంతో పాటు వారికి తాగడానికి నీరు, అవసమైతే ఆహారం కూడా అందించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామ సర్పంచులు లేదా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముందుకీ వచ్చి సమాచారాన్ని స్థానిక పోలీసులకు లేదంటే తనకు సమాచారం ఇవ్వాలని  క్రాంతికిరణ్ కోరారు. వారికి సహకరించే క్రమంలో తగిన జాగ్రత్తలు కూడా పాటించాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 

 

click me!