అన్ని పదవుల్లో ఆ సామాజిక వర్గమే.. లాక్‌డౌన్‌లో ఈ జీవోలేంటి: జగన్‌పై కూన ఫైర్

By Siva Kodati  |  First Published Apr 8, 2020, 3:07 PM IST

ఆంధ్రప్రదేశ్ లో విశ్వ విద్యాలయాల పాలకమండళ్లను రాజకీయ పాలకమండళ్లుగా మార్చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్


ఆంధ్రప్రదేశ్ లో విశ్వ విద్యాలయాల పాలకమండళ్లను రాజకీయ పాలకమండళ్లుగా మార్చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతుంటే గుట్టుచప్పుడు కాకుండా మార్చి 23వ తేదీన పాలకమండళ్ల నియామకం చేపట్టారని ఆరోపించారు.

14 యూనివర్సిటీల్లో ఒకేసారి ఎలాంటి  స్క్రీనింగ్స్ లేకుండా తన అనుయాయులకు పాలకమండళ్లు కట్టబెట్టారని రవికుమార్ విమర్శించారు. విశ్వ విద్యాలయాల పాలకమండళ్లను అవినీతిమయం, అరాచకమయం చేశారని ఎద్దేవా చేశారు.  

Latest Videos

14 యూనివర్సిటీల్లో 118మందిని నియమించగా అందులో 70మంది ఓసీలని, వారిలో  46 మంది రెడ్డి సామాజిక వర్గం వారేనని రవికుమార్ ధ్వజమెత్తారు. అన్నింట్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ  ఏపీని రాబందుల రాజ్యంగా మార్చేశారన్నారు.

Also Read:హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే రజనీ (వీడియో)

రాష్ట్రంలోని బీసీలు, దళితులు , గిరిజనులు, ఓసీల్లోని కాపు, కమ్మ, బ్రాహ్మణులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా రెడ్డి సామాజిక వర్గంతోనే అన్ని పదవులు భర్తీ చేస్తున్నారు కూన విమర్శించారు.

విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే వ్యక్తులను నియమించాల్సిన తరుణంలో రాజకీయ ప్రయోజనాలు ఆశించి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చి ఏపీలో విద్యావ్యవస్థను జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని రవికుమార్ గుర్తుచేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం గవర్నర్ ఆధ్వర్యంలో పాలకమండళ్ల నియమాకం జరగాలని, కానీ వలం విజయసాయిరెడ్డి ప్రోద్భలంతోనే నియామకాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

ఆఖరుకు విద్యావ్యవస్థలోనూ రెడ్డి రాజ్యాన్ని తీసుకొస్తున్నారని, కాకినాడ జేఎన్ టీయూలో విజయసాయిరెడ్డి సూచించిన వారినే నియమిస్తున్నట్టు ఏపీ ఉన్నతవిద్యామండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి తన నోట్ లో పొందుపరిచారని రవికుమార్ గుర్తుచేశారు.  

మేధావులకు నెలవుగా ఉన్న ఆంధ్రా యూనివర్సిటీని కూడా విజయసాయి రెడ్డి భష్టు పట్టించారని, తన అనుచరులను ఆంధ్రా వర్సిటీ పాలనమండలిలో నింపేశారని కూన ఎద్దేవా చేశారు.

Also Read:సింగపూర్ లో భర్త అంత్యక్రియలు.. ఏపీలో భార్యకు వాట్సాప్ లో ఫోటోలు

ప్రజలు ఒకసారి ఆలోచించాలి. విద్యార్థులు తిరగబడాలి. అధికార పార్టీ ప్రతి అంశాన్ని, సంఘటనను రాజకీయం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఏపీలో దాదాపు 500 పదవుల్లో రెడ్లే ఎక్కువగా ఉన్నారని, రెడ్డి వ్యవస్థను తీసుకొచ్చి అన్ని రంగాల్లో దోచుకుంటున్నారని రవికుమార్ ఆరోపించారు.

ఒకే సామాజిక వర్గాన్ని అందలం ఎక్కించి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యాలయాల గౌరవాన్ని దిగజార్చుతున్నారని ఆయన మండిపడ్డారు. లాక్ డౌన్ సమయంలో ఇటువంటి జీవోలు ఇచ్చే అధికారం మీకు లేదని, తక్షణమే పాలకమండళ్ల నియామకాలను రద్దు చేయాలని కూన రవికుమార్ డిమాండ్  చేశారు.

పాలకమండళ్ల నియామకంలో జరిగిన అవినీతి, ఆశ్రితపక్షపాతంపై మేము గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

click me!