కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్నప్పటికి ఏపిలో లాక్ డౌన్ ను ఎత్తివేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది.
అమరావతి: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యలో యావత్ భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల(ఏప్రిల్) 14వరకే ఈ లాక్ డౌన్ గడువు వుండగా కరోనా తీవ్రత తగ్గకపోవడంతో పొడిగించే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఏపి ప్రభుత్వానికి మాత్రం ఈ లాక్ డౌన్ ను కొనసాగించే ఉద్దేశ్యం లేనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే దశలవారిగా లాక్ డౌన్ ను విరమించుకుంటామని ప్రకటించిన జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.
తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్స్‌ను ప్రారంభిస్తూ ఆర్టీసి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి బస్సులను బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడం వల్ల లాక్‌డౌన్ పొడిగిస్తారని వస్తున్న వార్తలకు ఈ నిర్ణయంతో చెక్ పెట్టినట్లైంది.
ఇప్పటికే లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో ఏపిలో రవాణా, వ్యాపార రంగాలు కుదేలయ్యాయి. మళ్లీ పొడిగిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ప్రతిపాదనను పక్కన పెట్టేసిందని అధికార వర్గాల సమాచారం.
ఏప్రిల్ 15 నుంచి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసి ప్రకటించింది. ఏసీ బస్సుల బుకింగ్స్‌ను మాత్రం నిలిపివేసింది. కేవలం విజయవాడ బస్టాండ్ నుంచి వెళ్లే సర్వీసులను మాత్రమే బుకింగ్స్ ప్రారంభించింది ఆర్టీసి. దాదాపు 115 సర్వీసులకు టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించింది.
కరోనా ప్రభావం పూర్తిగా తగ్గితే దశల వారీగా మరిన్ని బస్సుల బుకింగ్స్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపింది. అప్పటివరకు పరిమిత రూట్లలో, తక్కువ బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు.