కరోనా ఎఫెక్ట్, ఏపీలోకి నో ఎంట్రీ: తేల్చేసిన జగన్

By narsimha lode  |  First Published Mar 26, 2020, 6:45 PM IST

:ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎక్కడి  వాళ్లు అక్కడే ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. మనవాళ్లను కూడ మనం రాష్ట్రానికి ఆహ్వానించుకొనే పరిస్థితి లేకపోవడం ఇబ్బందికరమన్నారు. 


అమరావతి:ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎక్కడి  వాళ్లు అక్కడే ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజలను కోరారు. మనవాళ్లను కూడ స్వంత రాష్ట్రంలోకి ఆహ్వానించుకొనే పరిస్థితి లేకపోవడం ఇబ్బందికరమన్నారు. 

గురువారం నాడు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని ఆయన కోరారు. కొంచెం కష్టమైనా అందరూ సహకరించాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. మన వాళ్లను కూడ మనం ఆహ్వానించే పరిస్థితి లేదన్నారు. 

Latest Videos

నిన్న రాత్రి జరిగిన ఘటనలు తనకు ఆవేదన కల్గించినట్టుగా చెప్పారు. ఏపీ సరిహద్దుల్లోకి వచ్చిన వారిని 14 రోజుల పాటు  క్వారంటైన్ లో ఉంచాల్సిన పరిస్థితులు వచ్చినట్టుగా చెప్పారు. ఈ షరతు ఆధారంగానే 44 మందిని రాష్ట్రంలోకి ఆహ్వానించామన్నారు. వారందరినీ క్వారంటైన్ కు తరలించామన్నారు. రాష్ట్ర సరిహద్దులను మూసివేసినట్టుగా సీఎం తెలిపారు. 

మూడు వారాల పాటు రాష్ట్ర వాసులు ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలని ఆయన కోరారు. తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడ మాట్లాడినట్టుగా జగన్ గుర్తు చేశారు. కేసీఆర్ కూడ సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హైద్రాబాద్ లో ఉంటున్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేవని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. 

కరోనా వ్యాప్తి నివారణ కోసం కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని జగన్  చెప్పారు. నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయన్నారు.

విదేశాల నుండి వచ్చిన వారిపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. విదేశాల నుండి ఏపీ రాష్ట్రానికి 27,819 మంది వచ్చినట్టుగా ఆయన చెప్పారు. కరోనా కోసం నాలుగు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేశామన్నారు. 

ప్రతి జిల్లాలో 200 బెడ్స్ ను కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంంగా కరోనా కోసం ఆసుపత్రులను సిద్దం చేశామని జగన్ తెలిపారు.

ఏపీలో పది పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఆయన గుర్తు చేశారు. కరోనాపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొందన్నారు. ఈ సమయంలో ప్రజలు కూడ ఇంటి నుండి బయటకు రావొద్దని ఆయన కోరారు.

Also read:కరోనా ఎఫెక్ట్: 3 నెలల బడ్జెట్‌కు ఆర్డినెన్స్, 27న ఏపీ కేబినెట్

గ్రామ వలంటీర్ల పనితీరుపై సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. మరో వైపు ఆరోగ్యం బాగా లేకపోతే 104 కు ఫోన్ చేయాలని సీఎం కోరారు. మరో వైపు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 1902 కు ఫోన్ చేయాలని జగన్ ప్రజలకు సూచించారు.

కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేందుకు ఐఎఎస్ అధికారులతో కమిటిని ఏర్పాటు చేశామన్నారు. రేషన్ బియ్యంతో పాటు వెయ్యి రూపాయాల నగదును కూడ అందిస్తామని ఆయన చెప్పారు.

click me!