కేంద్ర ప్రభుత్వం చెప్పినా పట్టించుకోరా? అలా చేస్తేనే బావుంటుంది: జగన్ సర్కార్ కు పవన్ సలహా

By Arun Kumar PFirst Published Mar 26, 2020, 5:34 PM IST
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలు, విద్యార్థులు, డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి ట్విట్టర్ ద్వారా స్పందించారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. 

కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి యావత్ దేశం లాక్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రం  తెలంగాణలో చిక్కుకుపోయి నానా ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులు, నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలు, నిత్యావసరాల కోసం ప్రజలు ఇలా వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువచ్చారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. 

''హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నో అబ్జెక్షన్ పత్రాలతో బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ వారిని సరిహద్దుల్లో ఆపివేయడంతో నడిరోడ్డుపై ఇప్పటికీ ఇబ్బందులుపడుతున్నారు. హాస్టల్స్ మూసివేతపై రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. చదువుకొంటున్నవారు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతీయువకులు ఉన్నారు. వారి వేదనను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్థం చేసుకొని స్వస్థలాలకు చేర్చాలి. అవసరమైన వైద్య పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉండమని సూచించండి. అలా రోడ్డుపై గుంపులుగా వదిలేస్తే కొత్త సమస్యలు వస్తాయి'' అని ఏపి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు పవన్  కల్యాణ్. 

''ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది అందరికీ ఎన్.95 మాస్కులు అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. అనుమానితుల శాంపిల్స్ సేకరించి, పరీక్షించే సిబ్బందికీ, సంబంధిత వైద్యులను పట్టించుకోవాలి. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, రక్షణ దుస్తులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. ఔట్ పేషెంట్ విభాగంలో ఉన్నవారికీ వీటిని అందించడం అవసరం. వైద్యులను, ఇతర సిబ్బందిని రక్షించుకోవడం చాలా అవసరం. రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్య పెంచాలి. వాటిలో శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యాన్ని పెంచాలి''  అని ప్రభుత్వాన్ని  కోరారు.

''నిత్యావసరాల కోసం రైతు బజార్లు, కిరాణా దుకాణాల దగ్గర జనం ఇప్పటికీ క్యూ కడుతున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత ఉండదు, అన్నీ అందుబాటులోకి తీసుకువస్తామనే భరోసాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం బలంగా చెబుతున్నా... రైతు బజార్లలో కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోతే ఎలా? ప్రజల ముంగిటకే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకువెళ్తే రోడ్డు మీదకు జనం రావడం గణనీయంగా తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి'' అంటూ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా పలు సలహాలు, సూచనలిచ్చారు. 

click me!