కరోనా కారణంగా ఆర్ధిక పరిస్ధితి దిగజారుతోంది: ప్రధానికి జగన్ విన్నపం

By Siva Kodati  |  First Published Apr 2, 2020, 4:11 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పాల్గొన్నారు. 


కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ 19ను ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం సమగ్ర విధానాలను అనుసరిస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో 2012 నాన్ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో ప్రత్యేకంగా కరోనా ఆసుపత్రులను నెలకొల్పామని సీఎం చెప్పారు. అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో కోవిడ్ 19 సోకిన వారికి చికిత్స అందించేందుకు గాను ప్రత్యేకంగా ఆసుపత్రులను కేటాయించామని జగన్ పేర్కొన్నారు.

Latest Videos

10,933 నాన్‌ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్‌ ఈ ఆస్పత్రుల్లో సిద్ధం చేశామని.. దీనికి తోడుగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్ కోసం మరో 20 వేల బెడ్లను రెడీగా ఉంచామని జగన్ అన్నారు.

Also Read:కరోనా నివారణకు భారీ సాయం... రూ.200 కోట్ల భారీ విరాళం

ఫిబ్రవరి 10, 2020 నుంచి ఇప్పటివరకూ 27,876 మందికిపైగా విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చారని.. వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మందికాగా  17,336 మంది రూరల్‌ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని సీఎం చెప్పారు. వీరిని తరచుగా కలుసుకున్నవారు, సన్నిహితంగా మెలిగిన వారు, వీరి కుటుంబ సభ్యులు... అంటే మొత్తంగా ప్రైమరీ కాంటాక్ట్స్‌ 80,896 మంది ఉన్నారు.

కోవిడ్‌ –19 లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సమగ్ర సర్వే చేశామని జగన్మోహన్  రెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇప్పటికి రెండు సర్వేలు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఢిల్లీలో తబ్లీగీ సమాతే సదస్సుకు హాజరైన వారిని గుర్తించి వారి క్వారంటైన్‌కు తరలించామని జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో మరిన్ని పరీక్షలు నిర్వహించడానికి టెస్టు కిట్లు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ మరిన్ని కావాల్సిన అవసరం ఉందని జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుందని సీఎం చెప్పారు.

Also Read:=హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి కరోనా పాజిటివ్: పోలీసులంతా హోం క్వారంటైన్

మార్చి 29 నుంచే ఏప్రిల్‌ నెలకు ఇవ్వాల్సిన రేషన్‌ ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, కేజీ కందిపప్పును ఉచితంగా ఇచ్చామని జగన్ గుర్తుచేశారు. పేద కుటుంబాలను ఆదుకోవడానికి, నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రతి కుటుంబానికి రూ. 1000లు కూడా ఏప్రిల్‌ 4వ తేదీన ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం  చేశారు.

నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగకుండా వాటిపై ప్రత్యేక కమిటీల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఈనెలలో ఇవ్వాల్సిన జీతాల్లో యాభై శాతం వాయిదా వేశామని సీఎం తెలిపారు.

ఆదాయం గణనీయంగా తగ్గడమే కాకుండా, కోవిడ్‌ –19 నివారణా చర్యలకోసం అనుకోకుండా ఖర్చులు పెరిగాయని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. 
 

click me!