గరికపాడు చెక్ పోస్టు వద్ద పడిగాపులు పడుతున్న విద్యార్థుల సమస్య పరిష్కారమైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ చొరవతో విద్యార్థులను నూజివీడులోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
అమరావతి: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్టు వద్ద పడిగాపులు కాస్తున్న విద్యార్థుల సమస్య పరిష్కారమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ తీసుకుని వారి సమస్యను పరిష్కరించారు. దాంతో గరికపాడు చెక్ పోస్టు వద్ద సాధారణ పరిస్థితి నెలకొంది.
తెలంగాణ నుంచి వచ్చిన 44 మందిని నూజివీడులోని క్వారంటైన్ కు అధికారులు బస్సుల్లో తరలించారు. అయితే, కొంత మంది వాహనదారులు హైదరాబాదు తిరిగి వెళ్లారు. క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లడానికి అంగీకరించని 200 మందిని సురక్షితంగా పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం తెలంగాణ వైపు నుంచి వచ్చే కార్లను తెలంగాణ చెక్ పోస్టు నుంచే పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. అత్యవసర పనులకు సంబంధించి మెడికల్ సంబంధిత కారణాలతో తగిన సాక్ష్యాలతో క్లీన్ సర్టిఫికెట్లు కలిగి ఉన్న వాళ్లను అనుమతిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని, ఎక్కడివారు అక్కడే తమ నివాసాలకు పరిమితం కావాలని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. తాజాగా గుంటూరు, విజయవాడల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ నుంచి విజయవాడ వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు.
మరో వైపు, గుంటూరు జిల్లాలో ఓ కరోనా కేసు బయటపడింది. ప్రత్యేక ప్రార్థనల్లో పొల్గొని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ రెండు కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది.
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. లండన్ లో ఎంసిఏ చదువుతున్న ఆ యువకుడు ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీన శ్రీకాళహస్తి చేరుకున్నాడు.
తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.