తెలంగాణ నుంచి బారులు: సరిహద్దులో వేల మంది ఆంధ్ర విద్యార్థిలు పడిగాపులు

By telugu team  |  First Published Mar 26, 2020, 8:35 AM IST

తెలంగాణ నుంచి బయలుదేరిన ఆంధ్ర విద్యార్థులు గరికపాడు చెక్ పోస్టు వద్ద పడిగాపులు పడ్డారు. హైదరాబాదులో హాస్టల్స్ మూసివేయడంతో వారు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు బయలుదేరారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట చెక్ పోస్టు వద్ద వేలాది మంది ఆంధ్ర విద్యార్థులు పడిగాపులు పడుతున్నారు. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా హైదరాబాదులోని వసతి సదుపాయాలను మూసివేసిన నేపథ్యంలో వారు స్వస్థలాలు వెళ్లడానికి పయనమయ్యారు. తెలంగాణ పోలీసుల అనుమతి తీసుకుని వారు స్వస్థలాలకు బయలుదేరారు. 

తెలంగాణ నుంచి ఆంధ్రకు వస్తున్న విద్యార్థులను గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు నాలుగు గంటల నుంచి సుమార్ 3 వేల మంది విద్యార్థులు పడిగాపులు పడుతున్నారు. దాంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి ఉన్నాయి. బుధవారంనాడు ఆ పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి ఆహారం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Latest Videos

స్థానిక యువత వారికి అల్పాహారం అందజేసింది. విజయవాడ సబ్ కలెక్టర్ చెక్ పోస్టు వద్దకు చేరుకునని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టుల నిర్వహించిన తర్వాత స్వస్థలాలకు పంపించడానికి రంగం సిద్ధం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. తాజాగా గుంటూరు, విజయవాడల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ నుంచి విజయవాడ వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు.

మరో వైపు, గుంటూరు జిల్లాలో ఓ కరోనా కేసు బయటపడింది. ప్రత్యేక ప్రార్థనల్లో పొల్గొని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ రెండు కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. 

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. లండన్ లో ఎంసిఏ చదువుతున్న ఆ యువకుడు ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీన శ్రీకాళహస్తి చేరుకున్నాడు. 

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

click me!