చాప కింద నీరులా వ్యాప్తి: ఏపీలో 143కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

By telugu teamFirst Published Apr 2, 2020, 7:01 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఈ ఒక్క రోజే 32 కేసులు అదనంగా నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరుకుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాప కింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. గురువారంనాడు గత 9 గంటల వ్యవధిలో మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ రోజు కొత్తగా 32 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరుకుంది. తాజాగా కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల్లో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాను దాటేసింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 23 కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నవారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మతప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారి వల్ల వారి కుటుంబ సభ్యులకు ఇతరులకు పాకుతోంది. 

ఢిల్లీ నుంిచ 1085 మంది తిరిగి రాగా, వారిలో 758 మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కన్నబాబు చెప్పారు. కడప, గుంటూరు, విశాఖల్లో మూడు ల్యాబ్స్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల శాంపిల్స్ పరీక్షల సామర్థ్యం 450 నుంచి 570కి పెరుగుతుంది.

ఇతర రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువగా కేసులు నమోదయ్యాయి. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరోనా ముప్పు పెద్దగా ఉండకపోవచ్చునని భావించారు. అయితే, నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చినవారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

click me!