ఏపీలో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేత: స్పష్టం చేసిన జవహర్ రెడ్డి

By Siva KodatiFirst Published Apr 7, 2020, 8:43 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మూడో దశ ప్రారంభంలో ఉందన్నారు

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మూడో దశ ప్రారంభంలో ఉందన్నారు.

ఏపీలో కరోనా హాట్ స్పాట్‌లను గుర్తిస్తున్నామని, గుర్తించిన ఏరియాల్లో కఠినంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని జవహర్ రెడ్డి తెలిపారు. ర్యాపిడ్ టెస్టుల ద్వారా కరోనా ఎంతమందికి వ్యాపించిందో తెలుస్తుందని, జిల్లాకు వంద నమూనాల చొప్పున సేకరించామని ఆయన చెప్పారు.

Also Read:లాక్ డౌన్ పొడిగింపు ప్రతిపాదన: కేసీఆర్ లెక్కలు ఇవీ!

ఫిబ్రవరి 5 నాటికి కేవలం 90 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఉందని, ఇవాళ వెయ్యిమందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి పెంచామన్నారు. మూడు వేల నుంచి నాలుగు వేల మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి పెంచే ఆలోచనలో ఉన్నామని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్ర స్థాయిలో నాలుగు కోవిడ్ 19 ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని చెప్పిన ఆయన, ఈ హాస్పిటల్స్‌లో మూడు షిఫ్టుల్లో మూడు బృందాలు పనిచేస్తున్నట్లు జవహర్ రెడ్డి వెల్లడించారు.

Also Read:గీత దాటుతున్నారా.. ఈ యాప్ పసిగట్టేస్తుంది: క్వారంటైన్ అమలుకు ఏపీ పోలీసుల ప్రయోగం

ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి రాష్ట్రానికి తిరిగొచ్చిన వారు వెయ్యి మంది వరకు ఉన్నారని ఆయన తెలిపారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారు, వాళ్లు కలిసిన వాళ్లతో సహా మొత్తం 3,500 మంది నమూనాలను సేకరించామని జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

ఏపీలో ఇప్పటి వరకు నమోదైన 304 పాజిటివ్ కేసుల్లో 280 మందికి మర్కజ్‌తో లింకు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఇంటింటి సర్వేలో భాగంగా సుమారు 5 వేలమంది అనుమానితులను గుర్తించామని జవహర్ రెడ్డి అన్నారు. 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఆర్డర్ ఇచ్చామని.. సుమారు 2 లక్షల మందికి టెస్టులు చేయాల్సి వుందని ఆయన తెలిపారు. 

click me!