మోడిజీ...ఈ పెద్దల మాట వినండి..!.. బడ్జెట్‌పైనే వారి ఆశలు

By Sandra Ashok KumarFirst Published Jan 30, 2020, 4:57 PM IST
Highlights

పంజాబ్‌-మహారాష్ట్ర బ్యాంక్‌ తరహా ఘటనలు అయినప్పుడు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. వారు జీవితాంతం కష్టించిన సొమ్ము ఇక  తిరిగిరాదనే ఆందోళనతో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. 

ఇంటర్నెట్‌డెస్క్‌: సీనియర్‌ సిటిజన్లు సంపాదన మొత్తం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో భద్రపర్చుకొంటారు. ముఖ్యంగా వడ్డీ ఎక్కువగా ఇచ్చే బ్యాంకులను ఆశ్రయిస్తారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌-మహారాష్ట్ర బ్యాంక్‌ తరహా ఘటనలు అయినప్పుడు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు.

వారు జీవితాంతం కష్టించిన సొమ్ము ఇక  తిరిగిరాదనే ఆందోళనతో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాలల్లో ప్రభుత్వం మరింత ఉదారంగా స్పందించాల్సి ఉంది. ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ తరహా అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. 

also read Budget 2020: బడ్జెట్‌ అంటే ఏమిటీ..?ఎవరు ప్రవేశపెడతారు...బేసిక్స్‌ మీకోసం...

సెక్యూరిటీ డిపాజిట్లకు..
ముఖ్యంగా వృద్ధులు, సీనియర్‌ సిటిజన్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను మాత్రమే నమ్ముకొంటారు. ఇవే స్థిరంగా ఆదాయాన్ని ఇస్తాయని భావించి వారు రిటైర్మెంట్‌ సొమ్ము మొత్తం వాటిల్లోనే భద్రపరుస్తారు. ఈ మొత్తంపై వచ్చిన వడ్డీతో వారు సంతోషంగా జీవిస్తారు. ఇటీవల పంజాబ్‌-మహారాష్ట్ర కోపరేషన్‌ బ్యాంక్‌ సంక్షోభంలో ఇరుక్కొన్నప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు.

ఆర్‌బీఐకు చెందిన డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ కేవలం రూ. లక్ష వరకు మాత్రమే బీమా ఇచ్చింది. ఇది ఏమాత్రం చాలదని సీనియర్‌ సిటిజన్లు భావించారు. దీంతోపాటు పీఎంసీ బ్యాంక్‌ స్కాం వెలుగులోకి రావడంతో మరోనాలుగు సహకార బ్యాంకుల నుంచి సొమ్ము విత్‌డ్రాపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.

దీంతో చాలా మందికి నెలవారీ ఖర్చులు అందక అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీమా మొత్తాన్ని కనీసం రూ.15లక్షలకు పెంచితేగానీ వృద్ధులకు ప్రయోజనకరంగా ఉండదని డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం వచ్చే రూ.లక్ష మొత్తం వారి ఖర్చులకు ఏమాత్రం సరిపోని పరిస్థితి  నెలకొంది. 

ఆరోగ్యబీమాపై మినహాయింపులు పెంచాలి..

ప్రస్తుతం ప్రభుత్వం సెక్షన్‌ 80(డీ) కింద ఆరోగ్య బీమా, మెడికల్‌ చెకప్‌లకు, కొన్ని రకాల జబ్బులపై సెక్షన్‌ 80(డీడీబీ) కింద, వైకల్యాలకు సెక్షన్‌ 80(డీడీ) కింద మినహాయింపులు ఇస్తోంది. ప్రభుత్వం వీటిపై ఇచ్చే మినహాయింపులను పెంచాల్సి ఉంది. వాస్తవంగా అయ్యే వైద్యఖర్చులపై పూర్తి మినహాయింపు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న మినహాయింపులు వైద్యఖర్చుల పెరుగుదల మేరకు లేవు. మరోపక్క ప్రభుత్వం అందజేస్తున్న ఆరోగ్య పథకం అనుకున్న స్థాయిలో లేకపోవడంతో వీరు సొంత ఖర్చులే పెట్టుకోవాల్సి వస్తోంది. 

మెరుగైన పథకాలు అవసరం..

పెరుగుతున్న ద్రవ్యోల్బణం విశ్రాంత ఉద్యోగులకు పెద్ద ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో వృద్ధుల కోసం మెరుగైన పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ బడ్జెట్‌లో ప్రయత్నాలు చేయాలి. ద్రవ్యోల్బణం అనుసంధానిత బాండ్లు విడుదల చేయాలని కోరుతున్నారు.

also read  Budget 2020: కష్టాలపై ‘దాదా’గిరి...అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ

గతంలో ఆర్‌బీఐ ఇటువంటి బాండ్లను ద్రవ్యోల్బణంపై అదనంగా 1.50శాతం చెల్లించేట్లు తీసుకొచ్చినా అంతగా విజయవంతం కాలేదు. ఈ అదనపు మొత్తాన్ని 3.50శాతంగా చేస్తే సీనియర్‌ సిటిజన్లకు మరింత ప్రయోజకరంగా ఉంటుంది. 

మెరుగైన బ్యాంకింగ్‌ సేవలు
సీనియర్‌ సిటిజన్లకు ఇంటి వద్దే బ్యాంకింగ్‌ సేవలను అందించాలన్నా ఆర్‌బీఐ మాటను ప్రభుత్వ రంగ బ్యాంకులు పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో సీనియర్‌ సిటిజన్ల వ్యవహారాలను చూసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని చాలా మంది వృద్ధులు కోరుతున్నారు.

ఇంటికొచ్చి సేవలు అందించడం పక్కన పెడితే.. బ్యాంకులకు వెళ్లినా ఎటువంటి సౌకర్యాలు అందడంలేదని  వాపోతున్నారు. ఈ ఇబ్బంది నుంచి సీనియర్‌ సిటిజన్లు బయటపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

click me!