Gold Atm: ఇక‌పై బంగారం కావాలంటే ఏటీఎంకు వెళ్లాల్సిందే.. హైద‌రాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 18, 2022, 03:56 PM ISTUpdated : Mar 18, 2022, 04:09 PM IST
Gold Atm: ఇక‌పై బంగారం కావాలంటే ఏటీఎంకు వెళ్లాల్సిందే.. హైద‌రాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు..!

సారాంశం

ఒక‌ప్పుడు ఏటీఎంలంటే డ‌బ్బుల‌నే విత్ డ్రా చేసే యంత్రాలుగానే ఉండేవి. కానీ ఆ త‌రువాత టెక్నాల‌జీకి అనుగుణంగా ఊహించ‌ని మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా బంగారం కోసం గోల్డ్ ఏటీఏంలు వ‌చ్చేశాయి. అవి మొద‌టిసారి హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డం విశేషం.

సాధారణంగా నగదు ఉపసంహరణ కోసం మనం ఏటీఎం కేంద్రాలని వినియోగిస్తాం. నగదును జమ చేయడానికి కూడా ఆయా బ్యాంకుల ఏటీఎంలను వినియోగించడం తెలిసిందే. ఇలా నగదు ఉపసంహరణ, జమ చేయడానికి మాత్రమే కాదు, త్వరలో బంగారం కోసం కూడా ఇదే తరహా ఏటీఎంలు అందుబాటులోకి వస్తున్నాయి. గోల్డ్ సిక్కా భారత్ వ్యాప్తంగా 3000 గోల్డ్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోను గోల్డ్ ఏటీఎంలు రానున్నాయి. గోల్డ్ సిక్కా బంగారం కొనుగోలు చేసేందుకు, విక్రయించేందుకు ఉపయోగపడే డిజిటల్ ప్లాట్‌ఫామ్.

బంగారం కొనుగోలు చేయడానికి ఇక దుకాణాలకు వెళ్లవలసిన అవసరం ఏమాత్రం ఉండదు! ఏటీఎంలలో పసిడిని కొనుగోలు చేసే అవకాశం ఈ ఏటీఎంల ద్వారా ఉంటుంది. వచ్చే 45 రోజుల నుండి 50 రోజుల్లో హైదరాబాద్‌లోని పాతబస్తి, సికింద్రాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో మూడు గోల్డ్‌ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు గోల్డ్ సిక్కా ప్రకటించింది. అంటే మొదట హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు కానున్నాయి. ఈ గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు చేయడానికి చెన్నైకు చెందిన టెక్ సంస్థ ట్రూనిక్స్ డేటావేర్, కేఎల్ హై-టెక్ సెక్యూర్ ప్రింట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గోల్డ్ సిక్కా సీఈవో తరుణ్ అన్నారు.

ఈ గోల్డ్ ఏటీఎంల నుండి ఒకేసారి 0.5 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు బంగారాన్ని నాణేల రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఇందుకు డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా ఈ సంస్థ జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులను ఉపయోగించవచ్చు. బంగారం స్వచ్ఛతకు సంబంధించిన వివరాలతో ప్యూరిటీ సర్టిఫికెట్ కూడా కొనుగోలు సమయంలో ఇస్తారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన 5 కిలోల పసిడిని లోడ్ చేసే సౌకర్యం ఉంది. ఇండియా గోల్డ్ మార్కెట్ టైమింగ్స్ ఉదయం గం.9.50 నుండి రాత్రి గం.11.50 మధ్య ఏటీఎంల ద్వారా బంగారం తీసుకోవచ్చు. ప్రస్తుతం దుబాయ్, బ్రిటన్ దేశాల్లో గోల్డ్ ఏటీఎంలు ఉన్నాయి. వీటి ద్వారా 10 గ్రాములు, 20 గ్రాముల గోల్డ్ కాయిన్స్ పొందవచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్