ఆడిటింగ్‌లో ఫ్రాడ్: డెల్లాయిట్‌పై నిషేధం తప్పదా? నిండా మునిగిన ఐఎల్ఎఫ్ఎస్

By telugu teamFirst Published Apr 29, 2019, 12:03 PM IST
Highlights


ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ ప్రధాన అడిటర్ సంస్థ ‘డెల్లాయిట్’పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ శాఖ ఐదేళ్ల నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) కేసులో మోసాలు, విధులను సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణలపై గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు డెలాయిట్‌పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకునే వీలుందని తెలుస్తున్నది.

దేశీయ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల రంగాన్ని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కుదిపేసిన సంగతి తెలిసిందే. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇటు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కనిపించిన సంగతీ విదితమే. 

ఈ క్రమంలోనే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఆడిటర్‌గా ఉన్న డెలాయిట్‌పై కంపెనీల చట్టంలోని సెక్షన్ 140 (5) కింద నిషేధం విధించే అంశాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు వార్తాసంస్థ ఐఏఎన్‌ఎస్ కథనాన్ని బట్టి తెలుస్తోంది. మోసపూరిత కార్యకలాపాలతో ప్రమేయం ఉన్న ఆడిటర్లపై చర్యలు తీసుకునేందుకు ఈ సెక్షన్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు అవకాశమిస్తుంది.

పక్కాగా కేంద్రం డెలాయిట్‌పై చర్యలు తీసుకుంటే నిషేధం ఎదుర్కొన్న రెండో అతిపెద్ద సంస్థగా నిలుస్తుంది. గతేడాది జనవరిలో సత్యం కుంభకోణం కేసులో ప్రైస్‌ వాటర్‌హౌజ్‌ కూపర్స్ (పీడబ్ల్యూసీ)పై స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

రెండేళ్లపాటు స్టాక్ మార్కెట్‌లోని సంస్థలకు, బ్రోకరేజీలకు ఆడిటింగ్ సేవల్ని అందించరాదని పీడబ్ల్యూసీని సెబీ ఆదేశించింది. మోసాలతో అక్రమంగా ఆర్జించిన రూ.13 కోట్లకుపైగా సొమ్మును చెల్లించాలని కూడా పీడబ్ల్యూసీకి స్పష్టం చేసింది.

సత్తాలేని కార్పొరేట్ సంస్థలకు పైపై మెరుగులు అద్ది, వాటిపై అంచనాలను పెంచడంలో ఆడిటర్ల పాత్రే కీలకం. ఆడిటింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటంతో కార్పొరేట్ కుంభకోణాలకు అంతే లేకుండా పోతున్నది. గతంలో సత్యం కంప్యూటర్స్ ఉదంతం తెలిసిందే. సంస్థ ఆర్థిక ఫలితాలను ఎక్కువ జూపి.. అంచనాల్ని అమాంతం పెంచేశారు. చివరకు నష్టపోయింది అమాయక మదుపరులు, ఉద్యోగులే.

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభంలోనూ ఆడిటర్లపై అనేకానేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సదరు సంస్థ ఆడిటర్ డెలాయిట్ పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, దర్యాప్తు జరుగుతున్నదని, అధికారులకు అన్నివిధాలా సహకరిస్తున్నామని, నియమ, నిబంధనలను పాటించే ఆడిటింగ్ చేశామని డెలాయిట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఆత్మరక్షణలో పడిన డెలాయిట్.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థలను తాము మాత్రమే ఆడిటింగ్ చేయలేదని, చాలాచాలా చిన్న సంస్థలు కూడా చేశాయని తెలిపింది. గతేడాది మే నెలలోనే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ చెల్లింపుల వైఫల్యం మొదలైందని డెలాయిట్ తెలిపింది. 

ఐఎల్ఎన్ఎస్ గ్రూప్ లోని ప్రధానమైన ఐటీఎన్‌ఎల్, ఐఎఫ్‌ఐఎన్ సంస్థల ఆడిటింగ్‌ను ఎర్నెస్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ సంస్థలు చేశాయని గుర్తుచేసింది. ఇదే క్రమంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని 347 అనుబంధ సంస్థల ఆడిటింగ్‌తో తమకు సంబంధం లేదని ప్రకటించింది. 

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థలు చాలావరకు విదేశాల్లో ఉన్నాయని పేర్కొన్నది. నైట్ ఫ్రాంక్ లేదా ఎన్‌ఎం రాయ్‌జీ వంటి ప్రముఖ సంస్థల మూల్యంకనం కూడా ఉందన్నది.

click me!