కరోనా దెబ్బకి ఎయిర్‌ఫ్రాన్స్‌లో 7500 ఉద్యోగాలు హాంఫట్!

By Sandra Ashok KumarFirst Published Jul 4, 2020, 3:56 PM IST
Highlights

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వివిధ రంగాల పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి విమానయాన రంగం కునారిల్లిపోతున్నది. ఫలితంగా ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ 7,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నట్లు ప్రకటించింది.  

పారిస్: కరోనా వైరస్ మహమ్మారితో తలెత్తిన నష్టాలతో కుదేలైన ఎయిర్‌ఫ్రాన్స్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. ఎయిర్ ఫ్రాన్స్ , దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్ సంయుక్తంగా 7,500 మందిని ఇంటికి పంపివేయాలని నిర్ణయించామని శుక్రవారం ప్రకటించాయి.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, భవిష్యత్తులో విమాన ప్రయాణ అవకాశాలపై నీలినీడలు కమ్ముకోవడంతో సంక్షోభంలో పడటంతో సంస్థ ఈ నిర్ణయం ప్రకటించింది. 

ఎయిర్‌ ఫ్రాన్స్‌ 6500 మందిని, హాప్‌లో వెయ్యిమందిని తొలగిస్తామని ఆ రెండు సంస్థలు వెల్లడించాయి. ఎయిర్‌ ఫ్రాన్స్‌లో మొత్తం 41వేలమంది ఉద్యోగులు, హాప్‌లో 2400 మంది పనిచేస్తున్నారు. కరోనా సంక్షోభంతో 3 నెలల్లో తమ ట్రాఫిక్ 95 శాతం పడిపోయిందని, దీంతో రోజుకు 15 మిలియన్ యూరోల నష్టం వచ్చిందని ఎయిర్‌ ఫ్రాన్స్‌ ప్రకటించింది.

2024 వరకు కోలుకునే ఆశలు కూడా లేవని  తెలిపింది. ఉద్యోగుల ఉద్వాసనను నిరసిస్తూ యూనియన్లు ఆందోళనకు దిగాయి. సిబ్బంది ప్రతినిధులతో చర్చల అనంతరం 2022 నాటికి ఈ తొలగింపులు ఉంటాయని యాజమాన్యం శుక్రవారం రాత్రి ప్రకటించింది. 

కొవిడ్‌​-19 ఒక సాకు మాత్రమేనని ఆందోళనకారుడు, హాప్‌ ఉద్యోగి జూలియన్ లెమరీ మండిపడ్డారు. కార్మికుల ఉపాధిని దెబ్బతీయడానికి బదులు, సంస్థ పునర్నిర్మాణం, బెయిల్‌ ఔట్‌  ప్యాకేజీపై దృష్టిపెట్టాలని డిమాండ్‌ చేశారు.

also read 

విమాన సేవలరంగంపై కరోన సంక్షోభంతో తీవ్ర ప్రభావం: ఇక్రా
కరోనా సంక్షోభం విమానయాన సేవల రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 41-46 శాతం వరకు తగ్గవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ ఏకంగా 67-72 శాతం వరకు క్షీణించవచ్చని అంటోంది.

కరోనా వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో 2 నెలలపాటు నిలిచిపోయిన దేశీయ విమానయాన సేవలు మే 25న తిరిగి ప్రారంభమయ్యాయి.

ద్వితీయార్థంలో పెరుగనున్న విమానయాన సేవలు
అంతర్జాతీయ విమానయాన సేవలు మాత్రం మార్చి 22 నుంచి నిలిచిపోయాయి. వీటి సేవల నిలిపివేతను జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. విమాన సేవలపై ఆంక్షలను క్రమంగా సడలిస్తుండటంతో ఈ రంగ పనితీరు ఇప్పట్లో కోలుకోకపోవచ్చని ఇక్రా అంటోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కాస్త మెరుగుపడవచ్చని, ముఖ్యంగా నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3-14 శాతం మేర వృద్ధి నమోదు కావచ్చని నివేదికలో పేర్కొంది.

click me!