విపణిలోకి మారుతి ‘జుఖి’ ఎర్టిగా.. పర్యావరణ హితమే లక్ష్యం

By rajesh yFirst Published Aug 9, 2019, 12:53 PM IST
Highlights

ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా దేశీయ ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలోకి మరో మోడల్ కారు ‘జుఖి ఎర్టిగా’ను బీఎస్- ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్లోకి విడుదల చేసింది. నిబంధనలు అమలులోకి రాక ముందే అన్ని మోడల్ కార్లను బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తామని మారుతి సుజుకి  ఎగ్జిక్యూటివ్ డైరెక్టరర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ బీఎస్‌-6 ప్రమాణాలతో జుఖీ ఎర్టిగా పేరుతో మరో మోడల్‌ విపణిలోకి విడుదల చేసింది. ఇప్పటికే ఆల్టో, వ్యాగాన్‌-ఆర్‌, స్విఫ్ట్‌, బాలెనో, డిజైర్‌లను ఈ ప్రమాణాలతో విడుదల చేసింది. తాజాగా మల్టీ పర్పస్‌ వెహికల్‌ జుఖీ ఎర్టిగా పెట్రోల్‌ వెర్షన్‌ను కూడా బీఎస్‌-6 ఉద్గార నిబంధనల ప్రమాణాలతో తెచ్చింది. దీని ధర రూ. 7,54,689గా నిర్ణయించింది.  

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న మారుతి సుజుకి
ఈ సందర్భంగా మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ గడువు కంటే కంటే చాలా ముందే కంపెనీ నుంచి బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను తీసుకొస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం’ అని చెప్పారు. 

నిబంధనలు అమలు చేయకముందే బీఎస్-6 ప్రమాణాలు అమలు చేస్తాం
‘బీఎస్‌-6 పెట్రోల్‌ వాహనాలు చాలా తక్కువ స్థాయిలో ఉద్గారాలను విడుదల చేస్తాయి. దీని వల్ల పర్యావరణానికి మేలు చేసిన వాళ్లమవుతాం. నిబంధనలు అమల్లోకి రాకముందే మా ఉత్పత్తులు అన్నింటినీ ఈ ప్రమాణాలతో ఆధునీకరిస్తాం’ అని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. 

64 నగరాలకు 5,595 ఈ-బస్సులు కేంద్రం మంజూరు

త్వరితగతిన ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశపెట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫేమ్‌’ పథకం కింద రెండో విడతలో భాగంగా 5,595 ఎలక్ట్రిక్‌ బస్సులు మంజూరయ్యాయి. ప్రజా రవాణాలో కాలుష్య ఉద్గారాల నియంత్రణకు దేశంలోని 64 నగరాల్లో ఇంటర్‌ సిటీ, ఇంట్రాసిటీ అవసరాల కోసం వీటిని వినియోగించనున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

రాష్ట్రాల నుంచే విద్యుత్ బస్సుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు
నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు సొంత నిర్వహణపై ఉపయోగించాలనే ఆసక్తి ఉన్న రాష్ట్రాల నుంచి భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ తొలుత ప్రతిపాదనలు స్వీకరించింది. ఈ మేరకు 26 రాష్ట్రాల నుంచి 14,988 ఈ-బస్సులు కావాలని 86 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని బేరీజు వేసుకున్న సంబంధిత కమిటీ చివరికి 5,095 ఈ-బస్సులను మంజూరు చేసింది. 

click me!