ఐఐటీ హైదరాబాద్ ప్లస్ ప్యూర్ ఎనర్జీతో విద్యుత్ వాహనాలు రెడీ

By rajesh yFirst Published Jul 12, 2019, 11:41 AM IST
Highlights

ఇంజినీరింగ్ విద్య క్రియేటివిటీకి పెట్టింది పేరు. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు, ప్యూర్ ఎనర్జీ స్టార్టప్ కలిసి విద్యుత్ వెహికల్స్ రూపొందించారు. త్వరలో నాలుగు రకాల మోడళ్లను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నారు.  

హైదరాబాద్: ఇక మార్కెట్లోకి సరికొత్త విద్యుత్ వాహనాలు రానున్నాయి. పూర్తిగా బ్యాటరీ ఆధారితంగా నడిచే ఈ ద్విచక్ర వాహనాలు పెట్రోల్ వాహనాలకు ధీటుగా రోడ్లపై దూసుకెళ్లన్నాయి. ఈ వాహనాల తయారీకి ప్రతిష్టాత్మక ఐఐటీ హైదరాబాద్ వేదికగా నిలిచింది. ప్యూర్ ఎనర్జీ స్టార్టప్ సంస్థ నేతృత్వంలో మరికొన్ని నెలల్లో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే తయారైన వాహనాల పనితీరును ఐఐటీ క్యాంపస్ ఆవరణలో టెస్ట్ రైడ్‌ల ద్వారా సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. తక్కువ ధరకే నాలుగు రకాల మోడళ్లలో ఈ విద్యుత్ వాహనాలను వినియోగదారులకు అందించనున్నారు. కొత్తగా ప్యూర్ ఎనర్జీ ఆధ్వర్యంలో తయారవుతున్న ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రముఖ ఫార్మా దిగ్గజం వీసీ నన్నపనేని 32 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడి ద్వారా ప్యూర్ ఈవీ సంస్థ విలువ రూ.240 కోట్లకు చేరింది.

ఐఐటీ హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నిషాంత్ డోంగ్రీ ప్యూర్ ఎనర్జీ పేరుతో స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. లిథియం బ్యాటరీ సహాయంతో వాయు, శబ్ద కాలుష్య రహిత వాహనాల తయారీపై మూడేళ్లుగా జరిపిన పరిశోధనలు విజయవంతం కావడంతో ఆ సంస్థ సీఈవో రోహిత్ వదేరా వాహనాలను మార్కెటింగ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

వచ్చే నాటికి నాలుగు రకాల మోడళ్లలో 10వేల వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురావాలనే లక్ష్యంతో సంస్థ ప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. మన రహదారులు ప్రజల అవసరాలను బట్టి కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. 

ఒక యూనిట్ కరెంటుకే బ్యాటరీ చార్జింగ్ ఫుల్ అవుతుండగా, 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలును కల్పించారు. వాహనదారునికి కిలోమీటర్‌కు కేవలం ఐదు పైసలే ఖర్చవుతున్నది. సేల్స్ పెరిగితే మరిన్ని వాహనాలను మార్కెట్‌లో సిద్దంగా ఉంచాలని సంస్థ భావిస్తున్నది. 

click me!