పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం: విపణిలోకి తొలి ‘ఇథనాల్‌’ అపాచీ ఆర్‌టీఆర్‌‌

By rajesh yFirst Published Jul 13, 2019, 11:00 AM IST
Highlights


కాలుష్య నియంత్రణకు ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ మోటార్ బైక్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్.. ఇథనాల్ సాయంతో నడిచే అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ ఈ100 బైక్ ను ఆవిష్కరించింది. పెట్రోల్ వేరియంట్ బైక్, ఇథనాల్ వర్షన్ అపాచీ ఒకేలా ఉన్నా ధర మాత్రం పెట్రోల్ వర్షన్ బైక్ కంటే రూ.9000 ఎక్కువ.

న్యూఢిల్లీ: ఇథనాల్‌తో నడిచే తొలి మోటార్‌సైకిల్‌ దేశీయ విపణిలో అడుగు పెట్టింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్ ఈ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇథనాల్‌తో నడిచే టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 ఎఫ్‌ఐ ఈ100 స్పెషల్‌ ఎడిషన్ మొదటగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. దీని ధర రూ. 1.20 లక్షలు మాత్రమే.

టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ స్పందిస్తూ..‘ద్విచక్ర వాహనాల స్థిరమైన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగానే హైబ్రీడ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుతున్నారు’ అని చెప్పారు.

‘ఈ తరుణంలో టీవీఎస్‌ వినియోగదారులకు ఇథనాల్‌ శక్తితో నడిచే మోటార్‌సైకిల్స్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సంస్థ భావించింది. పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే ఇథనాల్‌ మోటార్‌సైకిల్స్‌ పనితీరులో ఎలాంటి వ్యత్యాసాలు ఉండవు. అంతేకాక పర్యావరణానికి అనుకూలం’ అని టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ తెలిపారు.

2023 నాటికి 150 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న త్రీవీలర్స్‌, ద్విచక్ర వాహనాలను విద్యుదీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించిన నేపథ్యంలో ఇలాంటి ఒక నూతన ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు వేణు పేర్కొన్నారు.

పెట్రోల్ వేరియంట్ టీవీఎస్ అపాచీ బైక్ తో పోలిస్తే దీని ధర రూ.9000 ఎక్కువ. ఇక టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ ఈ100 మోటార్ బైక్ ఎంతమాత్రం పెట్రోల్ తో నడవదు. ఫ్యూయల్ వినియోగం, మెకానికల్ మార్పులు మినహా పెట్రోల్, ఇథనాల్ వేరియంట్ టీవీఎస్ అపాచీ ఒకేలా ఉంటాయి. 

పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ 34 శాతం ఇంధనాన్ని అందిస్తుంది. పెట్రోల్ కంటే ఇథనాల్ ధర తక్కువ కనుక రెండింటి వినియోగ వ్యయం ఒక్కటే కాకుంటే ఇథనాల్ వాడకంతో పర్యావరణం దెబ్బ తినకుండా ఉంటుంది. 

ఇథనాల్ వాడే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ ఈ 100 బైక్ 197సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉండటంతోపాటు 8500 ఆర్పీఎం వద్ద 21 హెచ్పీ, 7000 ఆర్పీఎం వద్ద 18.1 ఎన్ టార్చినిస్తుంది. ప్రస్తుతానికి దేశంలో ఇథనాల్ పంపిణీ చేసేందుకు పంపులు లేవు. కానీ ఆ దిశగా ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లీటర్ ఇథనాల్ ధర రూ.52-55 మధ్య ఉంటుందని అంచనా.
 

click me!