13 నెలల్లో విద్యుత్ వాహన సెగ్మెంట్లోకి బజాజ్‌

By rajesh yFirst Published Dec 27, 2018, 10:57 AM IST
Highlights


ఇతర సంస్థల మాదిరే బజాజ్ ఆటోమొబైల్ కూడా విద్యుత్ రంగ వాహనాల్లోకి ప్రవేశించేందుకు చర్యలు చేపడుతోంది. ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో మరో 13 నెలల్లో విద్యుత్ వాహనాలు రోడ్లపైకి వస్తాయని బజాజ్ ఆటోమొబైల్ ఎండీ రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ఇటీవల కొన్ని ఇబ్బందులు తలెత్తినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల విక్రయంలో 8-10 శాతం వ్రుద్ధి నమోదు కానున్నదని ఇక్రా పేర్కొంది. 

న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో 2020 నాటికి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లోకి ప్రవేశించనున్నదని ఆ సంస్థ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. ఈ విభాగం ఆకర్షణీయమైందన్నారు. వచ్చే 12 నెలల్లో మార్కెట్‌ వాటాను 15– 20 శాతం స్థాయి నుంచి 20–25 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. ‘‘రెండేళ్లలోనే 10 శాతం మార్కెట్‌ వాటాను సాధించడం మామూలు విషయం కాదు. ఇది 35 ఏళ్లుగా భారత్‌లో ఉన్న యమహా మార్కెట్‌ వాటాతో పోలిస్తే మూడు రెట్లు’’ అని రాజీవ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. 

అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వచ్చే కొన్ని నెలల పాటు సమస్యలుంటాయా? అన్న ప్రశ్నకు... ఆసక్తికరమైన ధోరణులతో ఉత్సాహంగా ఉన్నట్టు ఆయన బదులిచ్చారు. ఎగుమతులపై మార్కెట్లలో అనిశ్చితి నెలకొందని, అయినా 2018 చివరికి కంపెనీ 20 లక్షల యూనిట్లను 70 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు.


ద్విచక్ర వాహన విక్రయాల్లో 8-10% వృద్ధి! 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన విక్రయాల్లో 8-10% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఇక్రా అంచనా వేసింది. ద్విచక్ర వాహనాల కొనుగోలు వ్యయం పెరుగుతున్నా, వాటి సానుకూల గిరాకీని దెబ్బ తీసే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే వృద్ధికి ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చునన్నది. 

గత మూడు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈసారి సాధారణ వర్షపాతం నమోదు కావడం, తలసరి ఆదాయం పెరుగుతుండటం, పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) ప్రభుత్వం పెంచడం, కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తుండటం తదితర అంశాలు దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమ పరిమాణాన్ని 8-10 శాతం పెంచేందుకు దోహదం చేస్తాయని ఇక్రా తెలిపింది. రాబోయే కాలంలో ఈ రంగం స్థిరమైన వృద్ధి దిశగానే పయనిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.  
 

click me!