
ప్రతి ఏడాది భాద్రపద శుక్లాష్టమి రోజు రాధాష్టమి పండుగను నిర్వహించుకుంటాం. జన్మాష్టమి వచ్చిన 15 రోజుల తర్వాత రాధాష్టమి జరుగుతుంది. అంటే కృష్ణుడు పుట్టిన 15 రోజుల తర్వాత రాధ పుట్టిందని అంటారు. రాధాకృష్ణుల ప్రేమ, వారి రాసలీలలు గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉంటాం. శ్రీకృష్ణుడి జీవితంలో రాధాదేవికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రేమ చిహ్నంగా ఇప్పటికీ రాధాకృష్ణులే నిలిచిపోతారు.
కృష్ణుడి జీవితం గురించి అందరికీ తెలిసిందే. కృష్ణుడు ఎవరికి పుట్టాడు? ఎవరు పెంచారు? మహాభారత యుద్ధంలో ఏం చేశాడు? చివరికి ఎలా మరణించాడు? ఎంతో మందికి ఈ విషయాలపై అవగాహన ఉంది. కానీ శ్రీకృష్ణుడి ప్రేమికురాలు అయినా రాధా ఏమైందో మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది? ఎప్పుడు మరణించిందో కూడా ఎవరికీ తెలియదు. రాధాష్టమి సందర్భంగా మనం ఈ అంశాలను తెలుసుకుందాం.
కృష్ణుడు 125 ఏళ్ల వయసులో పొరపాటున వేటగాడి బాణం తగిలి తన శరీరాన్నిత్యజించాడని అంటారు. కానీ రాధా రాణి ఎలా మరణించిందో మాత్రం అక్కడ ప్రస్తావన లేదు. రాధా బృందావనంలో నివసించే వృషభానుడు, కీర్తిల కుమార్తె. చిన్నవయసులోనే కృష్ణుడిని మొదటిసారి చూసింది. చూడగానే ఆమె మూర్ఛపోయింది. శ్రీకృష్ణుడు మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పటినుంచి వారిద్దరి ప్రేమ అనంతంగా సాగుతూనే ఉంది. రాధాకృష్ణుల బాల్యం కలిసే సాగింది. కానీ వారి ప్రేమ.. వివాహం వరకు చేరుకోలేదు.
శ్రీకృష్ణుడు లోక కళ్యాణార్థం జన్మించిన విష్ణావతారం. అతడు బృందావనంలోనే ఉండిపోవడం కుదరదు. కంసుడిని చంపేందుకు శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళాడు. ఆ తర్వాత తిరిగి బృందావనానికి రాలేదు. దీంతో గోకులంతో పాటు రాధా రాణి కూడా జీవితాంతం శ్రీకృష్ణుడికి దూరమైపోయింది. గోకులాన్ని విడిచిపెట్టిన శ్రీకృష్ణుడు... పాండవులతో ఎంతో బిజీ అయిపోయాడు. ఇక రాధ తల్లిదండ్రులు చెప్పిన ఒక యాదవుడిని వివాహం చేసుకుంది. కానీ ఆమె మనసు మాత్రం కృష్ణుడికి అంకితం అయిపోయింది. రాధా రాణికి ఒక కొడుకు కూడా జన్మించాడని అంటారు. కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు.
రాధా పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె మనసులోంచి కృష్ణుడు దూరం కాలేదు. వృద్ధురాలిగా మారిన తర్వాత కూడా శ్రీకృష్ణుడి కోసం ఎదురును చూస్తూనే ఉంది. రాధ ఓసారి ద్వారకకు వెళ్లి కృష్ణుడిని కలిసింది. కృష్ణుడు రాధను చూసి ఎంతో సంతోషించాడు. తన ఎనిమిది మంది భార్యలకు ఆమెను చూపించాడు. తర్వాత రాధ తాను కృష్ణుడి రాజ భవనంలోనే ఉండిపోతానని కోరింది. దీంతో ఆయన రాజభవనంలోనే ఆమెకు ఒక పదవిని కేటాయించాడు. రాధా ఆ పదవిలో రాజభవనానికి సంబంధించిన పనులను చూసుకునేది. అవకాశం వచ్చినప్పుడల్లా కృష్ణుడిని తనివితీరా చూసి మురిసిపోయేది.
కానీ అలా తాను వేరొకరి భర్తను చూసి ప్రేమించడం ఆమెకు నచ్చలేదు. దీంతో రాజభవనం నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఒక అడవిలోని గ్రామంలో నివసించడం మొదలుపెట్టిందని వాదనలు ఉన్నాయి. రాధా వయసు పెరిగే కొద్దీ బలహీనంగా మారింది. ఆ బలహీనక్షణాలలో శ్రీకృష్ణుడిని స్మరించింది. అప్పుడు శ్రీకృష్ణుడు రాధ ముందు ప్రత్యక్షమయ్యాడు. రాధా తన కోసం వేణువు వాయించమని శ్రీకృష్ణుడిని కోరింది. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుంటే ఆ శ్రావ్యమైన రాగాన్ని వింటూ రాధ తన శరీరాన్ని విడిచిపెట్టింది. ఆ రాగంలోనే రాధ కలిసిపోయింది. రాధ మరణాన్ని భరించలేని శ్రీకృష్ణుడు తన చేతిలో ఉన్న వేణువును విరగ్గొట్టాడు. అప్పటినుంచి శ్రీకృష్ణుడి చేతిలో వేణువు కానీ ఇతర సంగీత వాయిద్యాలు ఏవీ వినియోగించలేదు.