స్త్రీలు వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేయాలి..?

By ramya neerukondaFirst Published Aug 23, 2018, 11:51 AM IST
Highlights

శరీరంలో ఒక రకమైన ఆకర్షణ ఇచ్చే గ్రహం శుక్రుడు. జాతకంలో శుక్రగ్రహం లోపంగా ఉంటే ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. ఆ ఆకర్షణను పెంచుకోవడానికి ఈ పూజ చాలా అవసరం. సరియైన సమయంలో వివాహం కావడానికి కూడా శుక్రుడే కారకుడు. 

శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమ ముందు శుక్రవారంనాడు ఈవరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. కొన్ని నియమ నిబంధనలు, ఆచార వ్యవహారాలకు లోబడి చేసేది వ్రతం. ప్రకృతిలో వచ్చే కొంత చెడు మార్పులను అనుకూలంగా మార్చుకోవడానికి చేసేది వ్రతం. ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరించే స్త్రీలు ఎంతో ఆనందోత్సాహాలతో ఉంటారు. వరలక్ష్మీపూజకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు. 

వరలక్ష్మీదేవి చారుమతి అనే స్త్రీకి కలలో కనిపించి ఈ వ్రతం చేసుకోమని ఆ వ్రత విధివిధానం చెప్పింది. భారతీయ జీవన విధానం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆయా కాలాల్లో ఆ వ్రతాలు ఏర్పాటు చేసారు. నియమ నిష్ఠలతో ఉంటూ అందరితో కలిసి ప్రశాంతంగా ఉండాలని వీటి ఉద్దేశం. ఎవరి స్థాయికి తగిన రీతిలో వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా ఈ వ్రతాలవల్ల అందరితో ఆనందంగా ఉండడం అనేది వీటి ముఖ్య లక్షణం.

విగ్రహానికి పూజ చేస్తున్నాము అనే భావన కాకుండా అమ్మవారే తమ ఇంటికి వచ్చి అలా కూర్చుని షోడషోపచారాలతో పూజ చేయించుకుంటుంది అని భావన చేయాలి. ఈ పూజలు చేసే స్త్రీలందరూ తమను తాము వరలక్ష్మిగా భావించుకోవాలి. శ్రద్ధా భక్తులతో పూజ చేయాలి. ఈ సమయంలో అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు, హారతి కర్పూరం ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలను ఎక్కువగా వెలిగిస్తారు. ధూపం వేయడం  కూడా ఉంటుంది. అవి ఇంటిని, ఇంట్లో వాతావరణాన్ని అనుకూలంగా ప్రశాంతంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు ఒక దేవాలయంగా మారుతుంది. అప్పుడు వచ్చే ఆలోచనలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. వ్యతిరేకమైన ఆలోచనల వైపు దృష్టి వెళ్ళదు.

వరలక్ష్మివ్రతం చేసేటప్పుడు రకరకాల పూలు, పండ్లతో అమ్మవారిని అలంకరించుకుంటారు. అలంకరణ చూసి ఆనందించుకుంటారు. అన్ని రకాల అలంకరణలకు శుక్రుడు కారకం వహిస్తాడు. ఆనందంగా ఉన్నప్పుడు సెలిటోనిన్‌ అనే హార్మోన్‌ ఒకటి శరీరంలో విడుదల అవుతుంది. ఈ హార్మోన్‌ వ్యక్తిని ఎక్కువకాలం సంతోషంగా ఉంచడానికి ఉపయోగ పడుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు స్పందనలు బావుంటాయి. సంతోషంగా లేకుండా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటే   ఎక్కువగా వేటి గురించి ఆలోచిస్తామో ఆ శరీర భాగంలో నరాలు కుంచించుకుపోయి ఆ స్థానంలో బ్లాక్‌ ఏర్పడుతుంది.

జాతకంలో శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నవారు ఈ పనులు ఎలాగూ చేస్తారు. శుక్రగ్రహం అనుకూలంగాలేనివారు ఈ పనులు ఎక్కువగా చేయాలి. వీరికి వాటిపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. కాని ఆసక్తిని ఏర్పరచుకోవడం చాలా అవసరం.   శుక్రుడు జాతకంలో అష్టమస్థానంలోగాని, షష్ఠ స్థానంలోగాని, వ్యయ స్థానంలోగాని ఉన్నవారు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు, ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా లేనివారు ఈ పనులు ఎక్కువగా చేయాలి. అలంకరణలు చేయడానికి ఓపిక చాలా అవసరం. ఈ పనులు చేయడానికి వీరికి అంతగా ఆసక్తి ఉండదు. 

శుక్ర గ్రహానికి అధిదేవత కూడా లక్ష్మీదేవి. వరం అంటే మేలు చేయడం. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన దేవత లక్ష్మీదేవి కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శుక్రుడు ప్రేమకు కారకుడు, వివాహాలకు కారకుడు. శరీరంలో ఒక రకమైన ఆకర్షణ ఇచ్చే గ్రహం శుక్రుడు. జాతకంలో శుక్రగ్రహం లోపంగా ఉంటే ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. ఆ ఆకర్షణను పెంచుకోవడానికి ఈ పూజ చాలా అవసరం. సరియైన సమయంలో వివాహం కావడానికి కూడా శుక్రుడే కారకుడు. 

అన్ని రకాల ఆనందాలు, అష్టైశ్వరాలను పొందాలంటే లక్ష్మీపూజ తప్పనిసరి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ పూజను అందరూ చేసుకోవడం మంచిది. 

డా. ప్రతిభ

read more news

శ్రావణమాసం విశిష్టత: ఏ రాశులవారు ఏం చేయాలి?

click me!