జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

Published : Aug 22, 2018, 03:19 PM ISTUpdated : Sep 09, 2018, 12:33 PM IST
జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

సారాంశం

మంచి తెలివితేటలు కలిగిన వారు. ఇతరుల అవసరాలు తీరేటట్లుగా చూస్తూ ఆ సమయాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటారు.

పొడవుగా, నిటారైన దేహం, అజానుబాహుతత్వం, సన్నని పాదాలు, నిశితమైన దృష్టి కలిగి ఉంటారు. కుశాగ్రబుద్ధి కలిగి, ఇతరుల అభిప్రాయాలకు అనుగుణమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి తెలివితేటలు కలిగిన వారు. ఇతరుల అవసరాలు తీరేటట్లుగా చూస్తూ ఆ సమయాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటారు.

కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వ్యవహరిస్తూ అందరికీ తలలో నాలుకలాగ వ్యవహరిస్తారు. కళలపై ఆసక్తి ఉంటుంది. చిన్న విషయాలకే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు. అవసరమైతే తమను నమ్మినవారిని ఇబ్బంది పెట్టే తత్త్వం కూడా కలిగి ఉంటారు. కొంత చంచల స్వభావం కలిగి ఉంటారు.

ప్రతి పనిలో విశ్లేషణ శక్తి చాలా ఉంటుంది. మంచి చెడు బేరీజు వేసుకొని కాని తొందరగా పని చేయరు. చంచల స్వభావం వలన మొదలు పెట్టిన కార్యాన్ని పూర్తి కాకుండానే మధ్యలో వదిలివేసే తత్వం కలిగి ఉంటారు. వీరికి రచనలంటే చాలా ఇష్టం. ప్రయాణాలంటే చాలా ఇష్టం. వీరు ఎక్కువగా తిరిగి చేసే పనులపై దృష్టి సారిస్తారు. ఆఫీసులో కూర్చుండి చేసే పనులు, అవసరమైతే బయట తిరిగి చేసే పనులు రెండూ కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తారు.

అన్ని సమయాలు అనుకూలంగా ఉంటే సహకారం అందించడం, తీసుకోవడం, రచనలపై దృష్టి అన్నీ బావుంటాయి. కాని సమయం అనుకూలంగా లేకపోతే తాము చేసే పనులే ఇబ్బంది పెడతాయి.

ఉదా : ఇతరుల సహకారం లభించడం లేదు - ఏదీ వ్రాయలేక పోతున్నాను - సేవకులు సరిగా ఉండడం లేదు - బంధువర్గ, సోదర సహకారం లేదు - సరిగా వినలేక పోతున్నాను వంటివి తృతీయ భావ లోపాల వల్ల కలిగే సమస్యలు.

తృతీయ భావాధిపతి 6,8,12 స్థానాల్లో ఉన్నా, తృతీయంలో 6,8,12 స్థానాధిపతులు ఉన్నా, తృతీయాధిపతి పై భావాధిపతులతో కలిసి ఉన్నా, నైసర్గిక అశుభగ్రహాలు తృతీయంలో ఉన్నా, తృతీయంలో అష్టకవర్గులో 24 కన్నా బిందువులు తక్కువగా ఉంటే సహకారాది లోపాలు ఉంటాయి. వీని వల్ల కలిగే వ్యతిరేక ఆలోచనలను వీరు మార్చుకోవాల్సి ఉంటుంది.

సహకార లోపాలకు వారి పూర్వకర్మలలో ఇతరుల సహకారం అధికంగా తీసుకోవడం, సేవా తత్పరత లేకపోవడం, సేవకులపై దౌర్జన్యంగా ప్రవర్తించడం, వ్యర్థమైన పనుల కోసం చేతులను వినియోగించడం, సోదరవర్గాన్ని ద్వేషించడం, పనికిరాని అంశాలను, ఇతరుల లోపగుణాలను వినడానికి ఇష్టపడడం వంటివి అధికంగా ఉండడం వంటివి కారణాలవుతాయి.

జ్యోతిర్వైద్య ప్రక్రియ ద్వారా వీరికి ఇతరుల సహకారం తక్కువగా లభిస్తుందని తెలుసుకుని తాను స్వయంగా ఇతరులకు సహకారం ఇవ్వడం నేర్చుకోవాలి. ఇతరులకు సాధ్యమైనంత వరకు పని చెప్పకుండా తన పని తాను చేసుకోవడం శ్రేష్ఠం. ఇతరుల మాటలను వినడం, సోదరులతో జాగ్రత్తగా మెలగడం వంటివి చేయడం ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుంది.

తన చుట్టూ ఉన్న దివ్య చైతన్యం తనకు గొప్పగా సహకరిస్తుందని, తన శరీర భాగాలు తనకు ఉపకారాన్ని ఇస్తున్నాయని, తాను సంతృప్తిగా ఉంటూ ఆ యా భాగాలతో ఇతరులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని భావిస్తూ ఉండాలి.

తాము చేసే పనిని గొప్పగా ప్రచారం చేసుకోకుండా దైవం తనకు అప్పగించిన బాధ్యతను తనకు తోచినంత వరకు చేస్తున్నామనే భానతో మాత్రమే ఉండాలి.

డా|| ఎస్‌. ప్రతిభ.

ఇవి కూడా చదవండి

జ్యోతిష్యం.. వృషభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

PREV
click me!

Recommended Stories

AI Horoscope: ఓ రాశివారికి కొత్త అవకాశాలు వస్తాయి
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు!