అనకాపల్లి: వైసిపిలోకి అవంతి, గంటాను దింపే యోచనలో బాబు

By Nagaraju penumalaFirst Published Mar 5, 2019, 3:29 PM IST
Highlights

ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకుని మళ్లీ విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. 
 

అనకాపల్లి: ఉత్తరాంధ్రలో అనకాపల్లి లోక్ సభ ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం అభ్యర్థుల ఎంపిక ఆయాపార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. అనకాపల్లి ప్రస్తుత ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చెయ్యనని తెగేసి చెప్పేశారు. తెలుగుదేశం పార్టీ తరపున గత ఎన్నికల్లో గెలిచిన అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడంతో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. అయితే వైసీపీలోకి చేరడంతో ఆయన వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. 

భీమిలి నియోజకవర్గం నుంచి గెలుపొంది అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. భీమిలి నియోజకవర్గం సీటుపై చంద్రబాబు ఎటూ తేల్చకపోవడంతోనే ఆయన పార్టీ మారారని ప్రచారం. 

ఇకపోతే వైఎస్ జగన్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అంగీకారం తెలపడంతో ఆయన సైకిల్ దిగిపోయి ఫ్యాన్ కింద సేద తీరుతున్నారు. వైసీపీలోకి చేరిన వెంటనే జగన్ ఆయనను భీమిలి ఇన్ చార్జ్ గా ప్రకటించేశారు. అవంతి వైసీపీలో చేరడంతో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిపై కసరత్తు ప్రారంభించింది టీడీపీ అధిష్టానం. 

తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం కావడంతో ధీటైన అభ్యర్థిని బరిలోకి దించాలని టీడీపీ భావిస్తోంది. 2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాసరావు భారీ విజయం సాధించారు. 

రాష్ట్రాన్ని విభజించిందన్న అక్కసుతో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన ప్రజలు గంపగుత్తగా టీడీపీకి వేసేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు విజయం సాధించింది. 1962 నుంచి తొమ్మిది సార్లు విజయం సాధించింది. ఐదు సార్లు టీడీపీ విజయం సాధించింది. 1999, 2004, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. 

అయితే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకుని మళ్లీ విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. 

గంటా శ్రీనివాసరావు1999 పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో మళ్లీ గంటా శ్రీనివాసరావును ప్రజలు ఆదరిస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. ఇకపోతే వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తారు అన్న అంశంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. 

అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరదు కళ్యాణి వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో గుడివాడ అమర్ నాథ్ ఇదే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది.  

click me!