
పాలకొల్లు: కేసీఆర్ మద్దతిచ్చిన వారెవరూ కూడ విజయం సాధించలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో కూడ ఏపీలో జగన్ గెలుస్తున్నారని కేసీఆర్ చెప్పారని.... కానీ, ఆ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మంగళవారం నాడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన జనసే ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ ప్రచార సభలో పవన్ కళ్యాణ్, నాగబాబులతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడ పాల్గొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పై కోపం ఉంటే దొడ్డిదారిన ఎందుకు జగన్‌కు మద్దతిస్తున్నారో చెప్పాలని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు విమోచన సమితిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన సూచించారు. మీలాంటి ధర్మపరులు కూడ జగన్‌కు మద్దతిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిస్తానని సోమవారం నాడు కేసీఆర్ ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే అదే సమయంలో ఈ ఐదేళ్లు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో టీఆర్ఎస్ ఎందుకు మద్దతివ్వలేదో చెప్పాల్సిందిగా కోరారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని ఆయన కోరారు. మీరు అడ్డుపడినా కూడ పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జగన్ చుట్టూ క్రిమినల్స్ ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే సాక్ష్యాలు దొరకకుండా రక్తపు మరకలను కూడ తుడిచేసిన చరిత్ర జగన్ కుటుంబానిదని ఆయన అభిప్రాయపడ్డారు. వెంకటేశ్వరస్వామిని చెప్పులు వేసుకొని జగన్ దర్శనం చేసుకోవడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు.
యాదగిరిగుట్టకు కూడ జగన్ చెప్పులు వేసుకొని వస్తే మీరు ఒప్పుకొంటారా అని కేసీఆర్‌ను పవన్ ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీ నాయకులను అడ్డుకొంటారు... కానీ ఏపీలో మాత్రం పెత్తనం చేయాలని కేసీఆర్ చూడడం ఎలా సరైందని ఆయన ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు
ప్రచారంలో పవన్, నాగబాబులతో అల్లు అర్జున్