లోకేష్ కి మద్దతుగా.. మంగళగిరిలో బ్రహ్మణి ప్రచారం

By ramya NFirst Published Apr 9, 2019, 11:17 AM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి.. తన భర్త లోకేష్ తరపున మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి.. తన భర్త లోకేష్ తరపున మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన భర్తకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆమె ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా బ్రహ్మణి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.  గత ప్రభుత్వ పాలనలో కేవలం రూ.రెండొందలు వున్న పింఛన్‌ను ఈ అయిదేళ్ల కాలంలో రెండు వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి న వెంటనే ఆ మొత్తాన్ని రూ.మూడు వేలకు పెంచుతుందన్నారు.
 
రూ.24వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారన్నారు. అన్న దాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.15వేలు అందిస్తుందన్నారు. మహిళల కోసం పసుపు-కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం రెండు దఫాలుగా రూ.20 వేలు ఉచితంగా ఇచ్చిందని చెప్పారు.

 నిరుద్యోగ యువతకు ప్రతినెలా భృతిని అందిస్తూ బాసటగా నిలుస్తోందన్నారు. ఈ పథకం వయో పరిమితిని 22 నుంచి 18 ఏళ్లకు తగ్గించి, యువతకు ఆర్థిక చేయూతనందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.రాష్ట్రం కోసం, ప్రజల కోసం లోకేశ్‌ ఎంతో కష్టపడుతున్నారని, ఆయనకు కుటుంబం కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు. 

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల కాలంలోనే రాష్ట్రంలో 24 వేల కిలోమీటర్ల పొడవున రోడ్లు నిర్మించారని, ఐటీ శాఖ మంత్రిగా రాజధాని ప్రాంతమైన మంగళగిరికి 42 కంపెనీలను తీసుకువచ్చి 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. 

రాబోయే అయిదేళ్లలో మరిన్ని పరిశ్రమలను స్థాపించి స్థానికంగా వున్న యువతకు 15 వేల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మంగళగిరిలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుందన్నారు.

click me!