త్వరలో వైసిపి బస్సు యాత్ర

First Published Feb 27, 2018, 4:19 PM IST
Highlights
  • ఎన్నికల  హడావుడి మొదలైన నేపధ్యంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

త్వరలో వైసిపి బస్సుయాత్రకు సిద్ధమవుతోంది. ఏపిలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే తెలంగాణాలో నేతలు బస్సుయాత్రకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. పార్టీ తెలంగాణా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణాలో ఎన్నికల  హడావుడి మొదలైన నేపధ్యంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున నలుగురు ఎంఎల్ఏలు, ఒక ఎంపి గెలిచిన సంగతి అందరకీ తెలిసిందే. అయితే, మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా అందరూ టిఆర్ఎస్ లో చేరారు. దాంతో వైసిపికి తెలంగాణాలో ప్రజాప్రతినిధులన్న వారే లేకుండా పోయారు. అటువంటిది పార్టీ పటిష్టానికి బస్సుయాత్ర చేస్తామని గట్టు ప్రకటించటం ప్రాధాన్యత ఏర్పడింది.

అన్నీ జిల్లాలను కవర్ చేస్తూ బస్సుయాత్ర ఉంటుందని గట్టు చెప్పారు. బస్సుయాత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తెలంగాణాలో చేసిన సేవలను, అభివృద్ధిని వివరిస్తామని చెప్పారు. అదే విధంగా తెలంగాణా అభివృద్ధి కోసం తమ పార్టీ తరపున చేపట్టబోయే కార్యాచరణను కూడా వివరిస్తామన్నారు. మార్చి 13వ తేదీన జిల్లాల అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు తదితరులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని గట్టు తెలిపారు. అయితే, బస్సుయాత్రకు ఎవరు సారధ్యం వహిస్తారన్న విషయాన్ని మాత్రం గట్టు చెప్పలేదు.

click me!