రూ. 3300 కోట్లు ఏమయ్యాయ్ ? లెక్కల కోసం కేంద్రం పట్టు

First Published Feb 27, 2018, 3:10 PM IST
Highlights
  • కేంద్రం-చంద్రబాబునాయుడు మధ్య సంబంధాలు చెడిపోవటంలో నిధుల విషయమే ప్రధానమన్న సంగతి అందరికీ తెలిసిందే.

వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఆ అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రం కేంద్రానికి లెక్కలు చెప్పటం లేదట. కేంద్రం-చంద్రబాబునాయుడు మధ్య సంబంధాలు చెడిపోవటంలో నిధుల విషయమే ప్రధానమన్న సంగతి అందరికీ తెలిసిందే. అనేక ప్రాజెక్టుల కోసం కేంద్రం పెద్ద ఎత్తునే నిధులు మంజూరు చేసింది. అయితే, ఖర్చు చేసిన నిధలకు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తిరిగి లెక్కలు చేప్పలేదు.

కేంద్రం నుండి నిధులు తీసుకోవటమే కానీ దానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం రాష్ట్రానికి లేదన్నది చంద్రబాబు వాదన. తాను పంపిన ప్రతీ రూపాయికి లెక్క చెప్పాల్సిందే అన్నది కేంద్రం పట్టు. కేంద్రం ఎంతడిగినా చంద్రబాబు లెక్కలు చెప్పకపోయేసరికి కేంద్రం నిధుల విడుదలను నిలిపేసింది.

ఈ నేపధ్యంలో కేంద్రం పంపిన నిధులకు రాష్ట్రం లెక్కలు ఎందుకు చెప్పటం లేదన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కేంద్రం ఏ ప్రాజెక్టు కోసమైతే నిధులు పంపిందో ఆ ప్రాజెక్టుకు కాక చంద్రబాబుకు అవసరమైన పథకాలకు నిధులు వ్యయం చేసినందువల్లే కేంద్రానికి లెక్కలు చెప్పలేకపోతున్నారనే ప్రచారం ఊపందుకున్నది. దానికి మద్దతుగా కొన్ని లెక్కలు కూడా తాజాగా వెలుగు చూసింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేంద్రం నుండి వచ్చిన నిధుల్లో సుమారు రూ. 3300 కోట్లకు లెక్కలు లేవట. రూ. 3300 కోట్లంటే చిన్న విషయమా? రాజధాని నిర్మాణం, స్మార్ట సిటిల నిర్మాణం, పిఎంఏవై లాంటి 13 పథకాలకు కేంద్రం భారీగా నిధులిచ్చిందట. అయితే, చంద్రబాబు తనిష్టం వచ్చిన పథకాలకు ఆ నిధులను ఖర్చు చేసారట. అంటే, చంద్రన్న తోఫా, రుణమాఫీ, చంద్రన్న సంక్రాంతి లాంటి జనాకర్షక పథకాలకన్నమాట.

పంపిన నిధులకు కేంద్రం లెక్కలడగటంతో రాష్ట్రప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది. అందువల్లే ఇపుడు కేంద్రానికి లెక్కలు చెప్పలేకున్నారు. వ్యయం చేసిన నిధులకు లెక్కల విషయంలో ఢిల్లీలోని ఏపి భవన్ అధికారులు రాష్ట్రంలోని ఉన్నతాధికారులను ఎంత ఒత్తిడి చేసినా ఉపయోగం కనబడలేదట. దాంతో కేంద్రం నుండి నిధులు రాబట్టటంలో ఢిల్లీలోని ఏపి భవన్ ఉన్నతాధికారులు కూడా చేతులెత్తేశారు. రాష్ట్రంలోని బిజెపి నేతలు కూడా అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించటంలోని మర్మం అదే అని అర్ధమవుతోంది.

click me!