
వైసీపీ అధ్యక్షుడు జగన్ "వైఎస్ఆర్ కుటుంబం" కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంతో పాటు, వైస్ఎస్ఆర్‌ను అభిమానించే కుటుంబాలను టచ్ చేయడమే "వైఎస్ఆర్ కుటుంబం" ముఖ్య ఉద్దేశం. పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నియోజకవర్గాల వారీగా వైసీపీ బూత్ కమిటీలోని వ్యక్తులకు ఈ భాద్యతలను అప్పగించారు. సెప్టెంబర్ 11వ తారీకు నుండి 20 రోజుల పాటు "వైఎస్ఆర్ కుటుంబం" కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పని చేయడంతో పాటు సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగిస్తారని ఆయన తెలిపారు. కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటికీ నవరత్నాల పథకం ఉద్దేశాన్ని తీసుకుని వెళ్లడానికి ఎంతో ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబంలో చేరాలనుకుంటే ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇవ్వండి "9121091210" అని ఆయన ప్రకటించారు. కోటి మందిని "వైఎస్ఆర్ కుటుంబం"లోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
అనంతరం జగన్ టీడీపీ పై ద్వజమెత్తారు. తెలుగు దేశం పార్టీ హాయాంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ముఖ్య ఉద్దేశంగా "వైఎస్ఆర్ కుటుంబం" ప్రారంభించామన్నారు. రైతుల రుణమాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు, బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే బాబు సీఎం కావాలన్నారు, కానీ ఒక్క హామీ అయినా నెరవేర్చారా... అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలను నిలువున మోసం చేశారని విరుచుకుపడ్డారు.
అదేవిధంగా వైఎస్ఆర్ గురించి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగమన్నారు. ఆయన హాయాంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందన్నారు.పేదవారికి కార్పోరెట్ వైద్యం అందిందన్నారు. గ్రామాల్లో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఉండేదని పేర్కొన్నారు.పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారని ఆయన తెలిపారు. మడమ తిప్పని నాయకుడంటే వైఎస్ఆర్ అని జగన్ అన్నారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి.