
ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు శనివారం లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు వుందని చెబుతూ.. నిన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. చంద్రబాబు పర్యటనకు అనేక అడ్డంకులు సృష్టించారని.. ఈ పరిణామాలపై స్పందించాలని ప్రధానిని రఘురామ కోరారు. అంతకుముందు ఢిల్లీలో ఆదివారం రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ..తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్ధితులను చంద్రబాబుపై దాడిగానే పరిగణించాలని అన్నారు.
తాను సింహాన్ని అంటూ జగన్ స్వయంగా ప్రకటించుకున్నారని.. కానీ పరదాల చాటున వచ్చేవారిని సింహం అంటారా అంటూ చురకలంటించారు. సింహం ఎవరో శుక్రవారం అనపర్తి ఘటనతో తేలిపోయిందని రఘురామ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన జోస్యం చెప్పారు. తమ పార్టీకి చెడ్డ రోజులు.. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని, పరిస్థితి చూస్తే వైసీపీకి పాతిక సీట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also REad: పరదాల చాటున వచ్చే వారిని సింహమంటారా : జగన్ టార్గెట్‌గా రఘురామ సంచలన వ్యాఖ్యలు
కాగా.. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీసు స్టేషన్‌లో చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు 8 మంది టీడీపీ నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ భక్తవత్సల ఫిర్యాదుతో కేసు నమోదైంది. శుక్రవారం రోజున చంద్రబాబు నాయుడు అనపర్తి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం బలభద్రపురం నుంచి అనపర్తి వరకు పాదయాత్రగా వెళ్లారు. అనంతరం అనపర్తిలో రోడ్‌లో మాట్లాడారు. అయితే చంద్రబాబు, టీడీపీ నాయకులపై నిబంధనల ఉల్లంఘన, పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించారని డీఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు సహా, టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే.. శుక్రవారం చంద్రబాబు నాయుడు అనపర్తి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు రోడ్ షో వేయవచ్చని.. అయితే రోడ్డుపై బహిరంగ సభలు పెట్టవద్దని పోలీసులు టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. వీరి ప్రతిపాదనకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి నాయుడుతో పాటు ఇతర నాయకులు అంగీకరించలేదు. ఇక, బలభద్రపురం గ్రామం వద్ద అనపర్తికి వెళ్లే దారిని పోలీసులు మూసివేసే ప్రయత్నం చేశారు. పోలీసులు, పార్టీ నేతలతో చర్చలు జరిపిన చంద్రబాబు అనపర్తి పర్యటనకు సిద్ధమయ్యారు. ఇంతలో టీడీపీ క్యాడర్ రోడ్డుపై పోలీసులు ఉంచిన బారికేడ్లను తోసివేయడంతో చంద్రబాబు ముందుకు సాగారు.