రాజ్యసభ అభ్యర్థులపై జగన్ కసరత్తు.. అనుహ్యంగా తెరపైకి ఆర్ కృష్ణయ్య పేరు.. పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే..

Published : May 17, 2022, 01:20 PM ISTUpdated : May 24, 2022, 09:40 AM IST
రాజ్యసభ అభ్యర్థులపై జగన్ కసరత్తు.. అనుహ్యంగా తెరపైకి ఆర్ కృష్ణయ్య పేరు.. పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాల దృష్ట్యా ఈ నాలుగు స్థానాలు కూడా అధికార వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు స్థానాలకు అభ్యర్థులపై సీఎం జగన్ విస్తృతమైన కసరత్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాల దృష్ట్యా ఈ నాలుగు స్థానాలు కూడా అధికార వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు స్థానాలకు అభ్యర్థులపై సీఎం జగన్ విస్తృతమైన కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సీఎం జగన్ పరిశీలనలో ఐదుగురు పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను దాదాపుగా ఖరారు చేశారని.. ఒక్క స్థానంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఆయన పార్టీ ముఖ్యనేతలతో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.

రాజ్యసభ అభ్యర్థుల విషయానికి వస్తే.. వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డిని మరోసారి కొనసాగించాలనే ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో మిగిలిన మూడు స్థానాల్లో లాయర్ నిరంజన్ రెడ్డి, బీద మనస్తాన్ రావు, కిల్లి కృపారాణి రేసులో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వైసీసీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో.. అనుహ్యంగా బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే అమరావతి చేరుకన్న ఆయన.. ఈ రోజు సాయంత్రం సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు రాజ్యసభ ఖరారైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేశారు. 

ఓ తెలుగు న్యూస్ చానల్‌తో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య..తనకు రాజ్యసభ అవకాశం ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. బీసీలు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో బీసీలకు పదవులు కేటాయించలేదని అన్నారు. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఇక, గతంలో ఆర్ కృష్ణయ్య పలు బహిరంగ సభల్లో వైఎస్ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు బీద మస్తాన్ రావు కూడా ఈ రోజు సాయంత్రం సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. దీంతో ఆయనకు కూడా రాజ్యసభ సీటు ఖాయమనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌ రావులను రాజ్యసభకు పంపడం దాదాపు ఖాయమైందని వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే మిగిలి ఒక్క స్థానంలో లాయర్ నిరంజన్ రెడ్డి లేదా కల్లి కృపారాణిలలో ఎవరికి కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇందులో నిరంజన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే ఈరోజు ఉదయం కర్నూలు పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో రాజ్యసభ అభ్యర్థుల ఖారారుపై సీఎం జగన్ చర్చించనున్నారు. అనంతరం రాజ్యసభ అభ్యర్థులపై అధికార ప్రకటన వెలువడనుంది. 

ఇక, త్వరలో దేశవ్యాప్తంగా ఖాళీ అవబోతున్న 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ (Rajya Sabha) సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 21తో ముగియనుంది. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న వారిలో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు, సురేష్ ప్రభులు ఉన్నారు. వీరిలో విజయసాయి రెడ్డి  వైసీపీది కాగా.. సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు టీడీపీ నుంచి గెలుపొంది ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఇక, బీజేపీ నేత సురేష్ ప్రభు అప్పటి టీడీపీ - బీజేపీ పొత్తులో భాగంగా ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాల ప్రకారం ఆ నాలుగు స్థానాలను కూడా అధికార వైసీపీ సొంతం చేసుకోనుంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు