
కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం లిమిట్ దాటొచ్చని అన్నారు వైసీపీ (ysrcp) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy). బడ్జెట్‌పై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం దాటడానికి లేదనడం ఎంత వరకు కరెక్ట్ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కావా అని దుయ్యబట్టారు. ఫైనాన్స్ కమీషన్ ఫార్ములా వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందని విజయసాయిరెడ్డి అన్నారు.
నదుల అనుసంధానం ఆహ్వానించదగ్గ పరిణామమని.. కానీ ఇప్పటికే గోదావరి- కృష్ణా నదులను ఏపీ ప్రభుత్వమే అనుసంధానిస్తోందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను కేంద్రం విడుదల చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను అడుగుతోందని ఆయన తెలిపారు. మధ్య తరగతి ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందడం లేదని.. కానీ బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావన లేదని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 8 లక్షల ఉద్యోగ ఖాళీల గురించి ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ధాన్యం సేకరణకు ఎలాంటి పాలసీ ప్రకటించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివిధ పథకాలకు సంబంధించి కేంద్రం ఫిక్స్ చేస్తున్న ఫార్మూలా ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు సరైన న్యాయం జరగడం లేదని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని.. జీఎస్టీ (gst) నష్టపరిహారం మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫైనాన్స్ కమిషన్ ఫార్మూలా వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. పీఎం గతిశక్తితో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామన్నారని... ఉద్యోగాల భర్తీపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనా లేదని ఆయన మండిపడ్డారు. ఎంఎస్‌పీకి న్యాయబద్దతపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదని.. సేవా రంగంలో వృద్ధి లేదని ఆర్థిక సర్వే చెబుతోందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.