ఇది ‘‘ జగనన్న మాంసం దీవెన’’.. మటన్ మార్ట్‌లపై రఘురామ కృష్ణంరాజు సెటైర్లు

By Siva KodatiFirst Published Sep 9, 2021, 8:16 PM IST
Highlights

ఏపీలో మటన్ మార్ట్ ల పేరిట త్వరలోనే ప్రభుత్వ మాంసం విక్రయశాలలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఇది జగనన్న మాంసం దీవెన అంటూ ఎద్దేవా చేశారు. 

ఏపీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న మటన్ మార్ట్‌లపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది జగనన్న మాంసం దీవెన అంటూ ఎద్దేవా చేశారు. "రాష్ట్ర ప్రభుత్వం మటన్ అమ్మడం ఏంటండీ... నీచంగా!... రాష్ట్ర ప్రభుత్వం మాంసం విక్రయిస్తుందా... ఛీ!" అంటూ ఘాటుగా స్పందించారు. 

ఈ క్రమంలో ఓ దినపత్రికలో మటన్ మార్ట్ లకు సంబంధించిన కథనాన్ని ఆయన లైవ్‌లో చదివి వినిపించారు. ఇలాంటి వ్యాపారాలకు బదులు రైతులు పండించే కూరగాయలకు మెరుగైన ధరలు లభించేలా చూడాలని రఘురామ హితవు పలికారు. ప్రభుత్వం మటన్ బదులు కూరగాయలు అమ్మితే ఆ పథకం కచ్చితంగా విజయం సాధిస్తుందని సూచించారు. ఈ పథకానికి జగనన్న కాయగూర దీవెన అని పేరు పెట్టుకోవాలని సూచించారు

Also Read:త్వరలో రాష్ట్రంలో మటన్ మార్ట్‌లు.. ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన, తొలి దశలో 112 ఏర్పాటు

కాగా, పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన గొర్రెలను, మేకలను ఎంపిక చేసి వాటిని కట్ చేయడానికి, వాటికి డ్రెస్సింగ్ చేయడానికి, ప్యాకేజ్ చేసి విక్రయించడానికి కావలసిన అన్ని రకాల వసతులను కల్పిస్తూ మటన్ మార్ట్‌ల పేరిట మొబైల్ వాహనాలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వాహనాల్లో దాదాపు పది గొర్రెలను, మేకలను కట్ చేసి విక్రయించడానికి వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. ఇక ప్రాసెసింగ్ చేసిన మాంసాన్ని నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్ లను కూడా ఈ వాహనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాహనాలలోనే గొర్రెల, మేకల వ్యర్థపదార్థాలను నిల్వ చేయడానికి ప్రత్యేకమైన డంపింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.

మటన్ మార్ట్ లను నిర్వహించే మొబైల్ వాహనాల ఒక్కొక్క యూనిట్ కు 10 లక్షల రూపాయల అంచనా వ్యయం అవుతుందని భావిస్తున్నారు. తొలిదశలో గ్రేటర్ నగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాలలో ఈ మటన్ మార్ట్ లను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మండల కేంద్రాలు పంచాయతీలలో మటన్ మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో 112 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి శిక్షణనిస్తారు.

click me!