సంక్రాంతికి సొంతూరికి వెళ్తా.. రక్షణ కల్పించండి : హైకోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్

By Siva KodatiFirst Published Jan 11, 2024, 9:41 PM IST
Highlights

సంక్రాంతి సందర్భంగా తాను సొంతూరుకి వెళ్తానని, రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

సంక్రాంతి సందర్భంగా తాను సొంతూరుకి వెళ్తానని, రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  రఘురామపై పోలీసులు 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం వుందని ఆయన తరపు న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, వైవీ రవి ప్రసాద్‌లు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోసారి రఘురామకృష్ణంరాజుపై తప్పుడు కేసులు పెట్టే అవకాశం వుందని, పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని వారు న్యాయస్థానాన్ని కోరారు. ఆర్నేష్ కుమార్ కేసులో 41 ఏ నిబంధనలు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయవాదులు ప్రస్తావించారు. 

మరోవైపు.. రఘురామకృష్ణంరాజు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. కేసు నమోదై, 7 ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం వున్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును శుక్రవారం వెలువరిస్తామని తెలిపింది. 
 

Latest Videos

click me!