దళిత మహిళను కాబట్టే చులకన.. ఉదయమే సీఎం జగన్‌ను కలిశాను: క్రాస్‌ ఓటింగ్‌ ప్రచారంపై ఎమ్మెల్యే శ్రీదేవి

By Sumanth KanukulaFirst Published Mar 23, 2023, 9:13 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. మొత్తం 7 స్థానాల్లో విజయం సాధించాలనే వైసీపీ ఆశలపై క్రాస్‌ ఓటింగ్‌ నీళ్లు చల్లింది. దీంతో వైసీపీ నుంచి క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిందేవరనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. మొత్తం 7 స్థానాల్లో విజయం సాధించాలనే వైసీపీ ఆశలపై క్రాస్‌ ఓటింగ్‌ నీళ్లు చల్లింది. వైసీపీ నుంచి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు క్రాస్ ఓటింగ్ చేయడంతో.. ఆమె విజయం సాధించారు. అయితే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినవారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి‌ ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే వైసీపీ వర్గాల్లోనే ఈ విధమైన ప్రచారం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తాను క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్టుగా జరుగుతున్న ప్రచారంపై ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. 

క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈ రోజు తన కూతురితో కలిసి  తాను సీఎం జగన్‌ను కలిశానని చెప్పారు. తన కూతురిని మంచిగా చదవమని కూడా జగన్ చెప్పారని తెలిపారు. తాను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందే జగన్ అని గుర్తుచేశారు. తమది వైసీపీ కుటుంబం అని అన్నారు.  తాను క్రాస్‌ ఓటింగ్ వేశానని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. రహస్య ఓటింగ్ జరిగిందని.. తాను క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్టుగా ఎలా అంటారని మండిపడ్డారు. పదవులు, డబ్బులు ముఖ్యం కాదని.. విలువలే తమకు ముఖ్యమని తెలిపారు. దళిత మహిళను కాబట్టే తనంటే చులకన అని అన్నారు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యే కాబట్టే తనను అవమానిస్తున్నారని చెప్పారు. 

Also Read: క్రాస్ ఓటింగ్ దెబ్బ.. వైసీపీ ఏడుగురు అభ్యర్థుల్లో ఒకరి ఓటమి.. టీడీపీకి అనుకూలంగా ఓటేసింది ఎవరు..?

Also Read: సీఎం జగన్‌కు భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపు.. ఫలించిన బాబు వ్యూహం..

రెండు, మూడు రోజుల్లో ఏం జరిగిందో బయటకు వస్తుందని అన్నారు. తనకిచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేశానని చెప్పారు. తన మీద అనుమాన పడతారని ముందు నుంచే చెబుతున్నానని చెప్పారు. కావాలంటే తాను వేసిన ఓటు కూడా చూపిస్తానని తెలిపారు. ఓటు చెల్లకుండా పోతుందని ఆ పని చేయలేదని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పారు. 
 

click me!