పాతకాలం నాటి నాయకుడిగానే మిగిలిపోయా.. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే.. : ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

By Sumanth KanukulaFirst Published Jan 10, 2023, 9:34 AM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లోనే ఉందని చెప్పారు. అప్పటి రాజకీయాలకు.. ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందన్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లోనే ఉందని చెప్పారు. అప్పటి రాజకీయాలకు.. ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందన్నారు. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలని అన్నారు. తాను ఆ కాలం నాటి రాజకీయ నాయకుడిగానే మిగిలిపోయానని చెప్పారు. వసంత కృష్ణప్రసాద్ సోమవారం మైలవరం మండలం చంద్రాల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టేనాటికి మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. నేను పుట్టిన రెండు మాసాలకే సర్పంచ్ అయ్యారు. నాకు రెండేళ్ల వయసున్నప్పుడే మా నాన్న ఎమ్మెల్యే అయ్యారు. ఈ రకంగా మా ఇంట్లో ఒకరకంగా 55 ఏళ్లుగా రాజకీయం నడుస్తోంది. అయితే అప్పటి రాజకీయాలకు.. ఇప్పటి రాజకీయాలకు గణనీయమైన మార్పు వచ్చింది. వసంత నాగేశ్వరరావు, పిన్నమనేని కోటేశ్వరరావు తరహా రాజకీయ నాయకుడిలాగే నేను మిగిలిపోయాను. ఈనాటి రాజకీయ నాయకులు వేగంగా ముందుకు పరుగెత్తాలంటే.. వెనకటి పెద్దరికం పనికిరాదు. పక్కన 10 మంది పోరంబోకులు ఉండాలి. వాళ్లు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తేనే రాజకీయాల్లో ముందడగు వేసే  పరిస్థితి ఉంది’’ అని అన్నారు. 

Also Read: ఉయ్యూరు శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు.. రాజకీయ వేదికపైకి వచ్చారనే వివాదం: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

అయితే తాను ఎన్నికలప్పుడూ మాత్రమే రాజకీయం చేస్తానని అన్నారు. తర్వాత నన్ను గెలిపిచినవాళ్లకు ఏ విధంగా మంచి చేయాలని చూస్తానని చెప్పారు. గత మూడున్నరేళ్లలో తానెక్కడా అక్రమ కేసులు పెట్టించలేదని.. పథకాలు ఆపలేదని చెప్పారు. కేసుల విషయంలో కొంతమంది తమ పార్టీ నాయకులకు తనపై అసంతృప్తి ఉండొచ్చని అన్నారు. 

ఇదిలా ఉంటే.. గత కొంతకాలం వసంత వెంకటేశ్వరరావు చేస్తున్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సోమవారం టీడీపీ ఎంపీ కేశినేని నాని‌తో వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. 

click me!