చంద్రబాబు, పవన్ కల్యాణ్ పేర్లే వేరు.. ఇద్దరూ ఒక్కటే: మంత్రి విడదల రజిని

By Sumanth KanukulaFirst Published Jan 9, 2023, 5:01 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై ఏపీ మంత్రి విడదల రజిని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పేర్లే వేరని.. వారిద్దరు ఒక్కటేనని అన్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై ఏపీ మంత్రి విడదల రజిని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పేర్లే వేరని.. వారిద్దరు ఒక్కటేనని అన్నారు. ఏపీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ కందుకూరు, గుంటూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారిని పరామర్శించకుండా.. చంద్రబాబు నాయుడను పరామర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

చంద్రబాబును గెలిపించేందుకే పవన్ తాపత్రయం అని ఆరోపించారు. ఎన్ని పార్టీలు కలిసివచ్చిన సీఎం జగన్ వెంటే రాష్ట్ర ప్రజలు ఉంటారని అన్నారు. అమాయక ప్రజల ప్రాణాలు కాపాడేందుకే జీవో నెంబర్ 1 తీసుకొచ్చినట్టుగా చెప్పారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం అనారోగ్యం పాలైందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేసి తీరుతామని.. ఇందుకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్నా అధిగమిస్తామని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతూ..  ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఏపీ సర్కార్ జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ర్ 1, పెన్షన్ లబ్ధిదారుల కోత, పాడిరైతులకు గిట్టుబాటు ధర చెల్లించకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను అణిచివేయడం మొదలైన వాటితో సహా పలు సమస్యలపై వారు చర్చించినట్లు నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని ఆరోపించారు. 

Also Read: RIP కాపులు.. కంగ్రాట్స్ కమ్మోళ్లు: ఆర్జీవీ సంచనల ట్వీట్.. మండిపడుతున్న పవన్ అభిమానులు

అయితే ఎన్నికల పొత్తులపై తర్వాత చర్చిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని.. సమీకరణాలను బట్టి పొత్తులు ఉంటాయని చెప్పారు. 2009లో టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకుందని గుర్తుచేశారు. ఆ తర్వాత విభేదించామని చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఏ నిర్ణయాలు తీసుకునే దానిపై తమ వ్యుహాలు తమకు ఉంటాయని చెప్పారు. 

రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేయాలో వివరంగా చర్చించామని కళ్యాణ్ చెప్పారు. బాధ్యతాయుతమైన పాలనను తీసుకురావడం తమ ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. తన మిత్రపక్షమైన బీజేపీతో కూడా ఈ అంశాన్ని చర్చిస్తానని కల్యాణ్ చెప్పారు. ఇక, గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో పవన్ కల్యాన్ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు ఆయనను విజయవాడలోని హోటల్‌లో కలిసి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. 

click me!