
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలో హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ , వైసీపీ కేడర్ పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబుపై వైసీపీ నేతలు, మంత్రులు భగ్గుమంటున్నారు.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించాయని అన్నారు. వేరే ప్రాంతాల నుంచి జనాన్ని రప్పించి వాహనాలను ధ్వంసం చేశారని కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఎందుకు పర్యటన జరగలేదని నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఎన్ఎస్జీ కమాండోలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు విధ్వంసానికి పాల్పడుతున్నారని కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇలా అలజడులు సృష్టిస్తున్నారని కారుమూరి ఆరోపించారు.
ALso Read: కాలేజ్ రోజుల నుంచి నేనే ఆయనకు టార్గెట్ .. ఓటమి భయంతోనే హింస : చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. పోలీసులపై దాడులు అమానుషమన్నారు. చంద్రబాబు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని భరత్ ఆరోపించారు. టీడీపీ శ్రేణులు మందస్తు ప్లాన్ ప్రకారమే దాడులు చేశారని.. అనుమతి వుంటే పోలీసులు వారిని ఎక్కడా ఆపరని ఎంపీ పేర్కొన్నారు. చంద్రబాబువి పాతతరం రాజకీయాలని.. ఆయన చిప్ అప్‌డేట్ కావాలంటూ భరత్ సెటైర్లు వేశారు.
పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బైపాస్ మీదుగా వెళతామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చి.. ఆ తర్వాత పుంగనూరు పట్టణంలోకి టీడీపీ కేడర్ రావాలని చూసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూటు మార్చడం వల్ల చంద్రబాబుకు ఏమైనా జరుగుతుందన్న భయంతో పోలీసులు దానికి అంగీకరించలేదని.. కానీ ఆయన మాత్రం టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేయించారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
కాన్వాయ్‌లోనే టీడీపీ నేతలు తుపాకులు, రాళ్లు తెచ్చారని మంత్రి ఆరోపించారు. రాజకీయంగా పోటీ పడలేమని తెలిసి చంద్రబాబు ఈ తరహా దాడులకు తెరలేపారని మంత్రి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో రాష్ట్రంలో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. కాలేజీ సమయం నుంచి చంద్రబాబు తనను టార్గెట్ చేశారని.. మా ప్రాంతంలో మూడు ప్రాజెక్ట్‌లు కడుతుంటే, కేసులు వేసి అడ్డుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read: పరిటాల రవి హత్య.. విధ్వంసం చేయాలని నాకు, కరణం బలరామ్‌కు ఫోన్ , చంద్రబాబు అలాంటోడు : నల్లపరెడ్డి
వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పుంగనూరులో చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు సంబంధించిన వాహనాల్లో రాళ్లు, రాడ్లు, కర్రలు, బీర్ బాటిళ్లు, గన్స్ వున్నాయని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పక్కా ప్లాన్‌తో గొడవలు చేయించి దానిని వైసీపీకి పులిమి లబ్ధి పొందాలని చూశారని ఆయన ఫైర్ అయ్యారు.
పరిటాల రవి హత్య సమయంలో తాను టీడీపీ ఒంగోలు ఇన్‌ఛార్జ్‌గా వున్న విషయాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ సమయంలో కరణం బలరామ్‌కు, తనకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి బస్సులు తగులబెట్టండి, విధ్వంసం చేయండి, షాపులను ధ్వంసం చేయమని చెప్పారని నల్లపరెడ్డి అన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు కలిగిన వ్యక్తి అని ఆయనో పెద్ద రౌడీ అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో పోలీసులపై దాడులు చేశారని.. దీని వెనుక చంద్రబాబు హస్తం వుందని ఆయన ఆరోపించారు. ఇలాంటి పనులు చేసేది చంద్రబాబేనని.. దానికి తాను, కరణం బలరామ్ సాక్ష్యులమని నల్లపరెడ్డి పేర్కొన్నారు.