
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కేశినేని నాని లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో శాంతిభద్రతల విషయంలో వేగంగా చర్యలు తీసుకుంటే.. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరించబడుతుందని అన్నారు. ఇటీవల జరిగిన ఘర్షణలపై సమగ్ర విచారణ జరిపి, హింసను ప్రేరేపించిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించాలని ప్రధాని మోదీని కోరారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనకరమైన శాంతిభద్రతల పరిస్థితి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న భద్రతా సమస్యలను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను. ఇటీవలి ఘటనలు వైసీపీ కార్యకర్తల హింస ఏ విధంగా పెరిగిందో చూపిస్తున్నాయి. ఫలితంగా పౌరులు, పోలీసులకు గాయాలు అయ్యాయి. ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం అంగల్లు గ్రామం, చిత్తూరు జిల్లా పుంగునూరులో ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో సుస్థిరత, భద్రతపై తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
చంద్రబాబు కార్యక్రమానికి అంతరాయం కలిగించడానికి గూండాలను పంపడంలో వైసీపీ మంత్రి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలుసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇది హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. ఇటువంటి చర్యలు పౌరుల మృతికి కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియకు, పౌర హక్కులకు తీవ్ర ముప్పును కలిగిస్తాయి.
శాంతిభద్రతల పరిరక్షణలో, పబ్లిక్ ఆర్డర్‌ను పరిరక్షించడంలో చట్ట అమలు సంస్థల పాత్ర కీలకం. అయితే పోలీసుల స్పందన సరిగా లేదని, వారి సిబ్బందిపై దాడి చేశారని, ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సంఘటనలను క్షుణ్ణంగా విచారించడం, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులను చట్టాన్ని అమలు చేసేవారు సమర్థవంతంగా పరిష్కరించగలరని నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి భారత ప్రధానిగా జోక్యం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చంద్రబాబు, ఇతర రాజకీయ నేతలకు భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయడం చాలా ముఖ్యం. ఇటీవల జరిగిన ఘర్షణలపై సమగ్ర విచారణ జరిపి, హింసను ప్రేరేపించిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించాలని కూడా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అదనంగా ప్రజాస్వామ్య కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలి.
పౌరులు మరియు రాజకీయ నాయకుల భద్రత కల్పించడం, భద్రతను నిర్ధారించడం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత. ఒక ప్రజాప్రతినిధిగా.. ఈ సమస్యలను సత్వరమే, సమర్ధవంతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజాస్వామ్య విలువలు, శ్రేయస్సును కాపాడటంలో మీ సత్వర చర్య కోసం నేను ఎదురు చూస్తున్నాను’’ అని కేశినేని నాని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, కేశినేని ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఇదేమీ రాజులు, మహారాజుల పాలన కాదని.. ప్రజాస్వామ్యం అని అన్నారు. నలభై ఐదు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన చంద్రబాబు నాయుడికే ఇటువంటి ఇబ్బంది కలిపించడం దుర్మార్గమని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు అందరం ప్రధాని మోదీని కలసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని వివరిస్తామని చెప్పారు.