ఆర్ 5 జోన్ వివాదం.. కోర్టుకు వెళ్లింది రియల్టర్లు, బ్రోకర్లే .. వాళ్లందరికీ బాస్ చంద్రబాబే : సజ్జల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 17, 2023, 7:29 PM IST
Highlights

ప్రభుత్వానికి దఖలు పడిన భూమిని పేదలకు ఇస్తే తప్పేంటని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.  కోర్టుకు వెళ్లింది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లేనంటూ సజ్జల సీరియస్ అయ్యారు. 

అమరావతిలో భూముల కుంభకోణం, ఆర్ 5 జోన్ ‌వివాదంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సుప్రీంకోర్ట్ తీర్పు అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు ఇళ్లు ఇస్తే ఏ పార్టీ అయినా సపోర్ట్ చేయాలన్నారు. రాజకీయ పార్టీగా టీడీపీ అర్హత కోల్పోయినట్లేనని.. రైతుల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని సజ్జల పేర్కొన్నారు. పూర్తిగా స్వార్ధం, రాజకీయ, ఆర్ధిక అవసరాలను ఆశించే అడ్డంకులు సృష్టిస్తున్నారని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని సజ్జల స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల తీరు చాలా అన్యాయంగా వుందని ఆయన ఫైర్ అయ్యారు. కోర్టుకు వెళ్లింది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లేనంటూ సజ్జల సీరియస్ అయ్యారు. వీళ్లందరికీ నాయకత్వం వహిస్తున్న పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. పేదలు , శ్రామికులు, కార్మికులు లేకుండా ఏ నగరమైనా వుంటుందా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి దఖలు పడిన భూమిని పేదలకు ఇస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. గుడిలో లింగం, మట్టి అన్నీ మింగేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 

కాగా.. అమరాతి రాజధాని ప్రాంతంలో ఆర్‌-5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అమరావతి రైతులు సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. వాస్తవానికి ఎలక్ట్రానిక్ సిటీ కోసం ఉద్దేశించిన ఆర్-5 జోన్‌లో గృహ స్థలాలను ఈడబ్ల్యూఎస్ సమూహాలకు కేటాయించాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోదని తెలిపింది. పట్టాలు పంపిణీ చేస్తే కనక హైకోర్టులో పెండింగ్ రిట్ పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండదని పేర్కొంది. 

ALso Read: ఆర్‌5 జోన్‌లో పేదల ఇళ్ల స్థలాలకు ఇవ్వొచ్చన్న సుప్రీం కోర్టు.. హైకోర్టు తుది తీర్పుకు కట్టుబడి ఉండాలని ఆదేశాలు

ఇక, విచారణ సందర్భంగా.. రైతుల తరపున న్యాయవాదనలు, ప్రభుత్వం తరపున న్యాయవాదులు సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించారు. రైతుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రం, దేశ ప్రయోజనాలు కోసం రైతులు భూమిలిచ్చారని చెప్పారు. అమరావతిలో మహా నగరం వస్తుందని హామీ ఇచ్చారని.. ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఆశ చూపారని తెలిపారు. ఆ మాటలు నమ్మి ఎలాంటి పరిహారం తీసుకోకుండా భూములిచ్చారని చెప్పారు.  

ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మనుసింఘ్వీ.. 2003 మార్చి 21న ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. 34 వేల ఎకరాల్లో 900 ఎకరాలే ఈడబ్ల్యూఎస్‌కు ఇచ్చారని చెప్పారు. 3.1 శాతమే ఈడబ్ల్యూఎస్‌కు ఇచ్చారని తెలిపారు. ఇక్కడున్న కేసులన్నీ వ్యక్తిగతంగా వేసినవేనని చెప్పారు. ఫ్లాట్ల అలాట్‌మెంట్ పూర్తైందని తెలిపారు. లబ్దిదారుల జాబితా ప్రభుత్వం వద్ద సిద్దంగా  ఉందని  చెప్పారు. జాబితా విషయాన్ని లబ్దిదారులకు ఇంకా చెప్పలేదని అన్నారు. 
 

click me!