వైసీపీలో ఉరవకొండ సీటు లొల్లి: ఎమ్మెల్యేకు సోదరుడు ఝలక్

By Nagaraju penumalaFirst Published Feb 24, 2019, 8:27 PM IST
Highlights

విశ్వేశ్వర్ రెడ్డి ఒకవైపు ఆయన తనయుడు మరోవైపు ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచుతున్నారు. ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు తిరుగేలేదు అనుకుంటున్న తరుణంలో ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారు. 
 
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేత విశ్వేశ్వర్ రెడ్డి. తన మాటల తూటాలతో ఇతర పార్టీలను ఇరుకున పెట్టగల సమర్థుడు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన విశ్వేశ్వర్ రెడ్డి  ఉరవకొండ నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

విశ్వేశ్వర్ రెడ్డి ఒకవైపు ఆయన తనయుడు మరోవైపు ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచుతున్నారు. ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు తిరుగేలేదు అనుకుంటున్న తరుణంలో ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారు. 

2019 ఎన్నికలకు విశ్వేశ్వర్ రెడ్డి రెడీ అవుతున్న తరుణంలో టికెట్‌ రేసులో తాను ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కావాలన్న తన మనసులో మాటను సోదరుడు దగ్గరో, సన్నిహితుల దగ్గరో చెప్పకుండా నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగంగా చెప్పేశారు. 

ఎమ్మెల్యే సోదరుడి వ్యాఖ్యలు ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తనకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కోరానని అలాగే జిల్లా ఇన్ చార్జ్ మిథున్ రెడ్డిని కూడా అడిగినట్లు చెప్పుకొచ్చారు. 

లండన్ నుంచి వైఎస్ జగన్ వచ్చిన తర్వాత మరోకసారి కలుస్తానని కూడా ప్రకటించేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు మారుపేరులా ఉంటున్న విశ్వేశ్వర్ రెడ్డికి ఇలా తమ్ముడి నుంచి పోరు ఎదురవ్వడంతో ఆయన తలపట్టుకుంటున్నారట. 

click me!