నాకు ఓటెయ్యోద్దని ఫత్వా చేయించావ్, మరి నీకూతురుకి: జలీల్ ఖాన్ పై టీడీపీ నేత మల్లికా బేగం ఫైర్

By Nagaraju penumalaFirst Published Feb 24, 2019, 8:20 PM IST
Highlights

ఇప్పటికే రగిలిపోతున్న నాగూల్ మీరాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. కానీ మల్లికా బేగం మాత్రం ఊరుకునేలా లేరు. దీంతో జలీల్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనపై పార్టీలో ఇంత అసంతృప్తి ఉందా అంటూ సన్నిహితుల వద్ద వాపోయారట జలీల్ ఖాన్. 

విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు రోజురోజుకీ బట్టబయలవుతున్నాయి. అభ్యర్థుల కేటాయింపు ఆ పార్టీలో పెద్ద దుమారం రేపుతోంది. 

ముఖ్యంగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా జలీల్ ఖాన్ కుమార్తె షభానా ఖాతూన్ ను ఎంపిక చెయ్యడంపై నియోజకవర్గంలోని టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ సీనియర్ నేత నాగూల్ మీరా దాదాపు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు.  

2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాగూల్ మీరా లేదా ఆయన వర్గీయులను బరిలో దించాలని భావించారు. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా షభానా ఖాతూన్‌ను ఖరారు చేయడంపై ఆయన అలకపాన్పు ఎక్కారు. 

మరోవైపు మాజీ మేయర్‌ మల్లికా బేగం సైతం షభానా ఖాతూన్ అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు రెడీ అవుతున్న సమయంలో తనకు ఓటేయోద్దంటూ జలీల్ ఖాన్ మతపెద్దల చేత ఫత్వా జారీ చేయించారని మల్లికాబేగం ఆరోపించారు. 

మరి ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె వియవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్ధం అవుతోందని కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చెయ్యాలని డిమాండ్ చేశారు. తనను రాజకీయాల్లో ఉండకూడదని 2009లో ఫత్వా జారీ చేసిన కుల పెద్ద మఫ్తి మౌలానా అబ్దుల్ ఖదీర్ కు వినతిపత్రం సమర్పించేందుకు ఆమె రెండు రోజుల క్రితం ప్రయత్నించారు. 
మతపెద్ద అందుబాటులో లేకపోవడంతో ఆమె అతని ఇంటి వద్దే నిరసన తెలిపిన విషయం తెలిసిందే. మహిళలు రాజకీయాలలో ఉండకూడదని ఫత్వా జారీ చేసిన కుల పెద్దలు జలీల్‌ఖాన్‌ కుమార్తె విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

ఇప్పటికే రగిలిపోతున్న నాగూల్ మీరాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. కానీ మల్లికా బేగం మాత్రం ఊరుకునేలా లేరు. దీంతో జలీల్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనపై పార్టీలో ఇంత అసంతృప్తి ఉందా అంటూ సన్నిహితుల వద్ద వాపోయారట జలీల్ ఖాన్. మరి ఈ సమస్యను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.  
 

click me!