వైఎస్ వివేకా హత్య కేసు సాక్షి గంగాధర్ రెడ్డి హఠాన్మరణం

By narsimha lode  |  First Published Jun 9, 2022, 9:36 AM IST


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి  అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. 


అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కల్లూరు Gangadhar Reddy అనుమానిస్పద  స్థితిలో మృతి చెందాడు. YS Vivekananda Reddy murder  కేసులో తనపై CBI  అధికారులు ఒత్తిడి చేశారని గంగాధర్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాదు తనను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా చెప్పారు. ఈ విషయమై  Anantapur ఎస్పీకి కూడా పిర్యాదు చేశారు. యాడికిలోని తన నివాసంలోనే గంగాధర్ రెడ్డి మరణించడం కలకలం రేపుతుంది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన సాక్షిగా ఉన్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ప్రాణహాని ఉందని గంగాధర్ రెడ్డి గతంలోనే పోలీసులకు పిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి అనుచరులతో పాటు సీబీఐ నుండి తనకు ప్రాణహాని ఉందని 2021 నవంబర్ 29న అనంతపురం ఎస్పీ Pakirappa కు ఫిర్యాదు చేశాడు. తనకు సీబీఐ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని కూడా ఆ ఫిర్యాదులో గంగాధర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ YS Avinash Reddy ప్రమేయం ఉందని చెప్పాలని తనపై సీబీఐ అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Latest Videos

undefined

తానే వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆ సమయంలో ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఆయన అప్పట్లోనే స్పష్టం చేశారు. ఈ విషయమై అప్పటి అనంతపురం ఎస్పీ ఫకీరప్ఫ స్పందించారు.  గంగాధర్ రెడ్డి పిర్యాదు ఆధారంగా రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఈ విషయమై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తామని కూడా ఎస్పీ ఫకీరప్ఫ అప్పట్లోనే మీడియాకు చెప్పారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను బెదిరింపులకు గురి చేస్తున్నారనే అంశంతో పాటు గంగాధర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశంపై విచారణ చేస్తామని ఎస్పీ వివరించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న  శ్రీనివాస్ రెడ్డి 2019 సెప్టెంబర్ 3వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ భాస్కర్ రెడ్డికి, సీఎం జగన్ కు లేఖ కూడా ఆయన రాశాడు. పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా  ఆ లేఖలో పేర్కొన్నారు.,ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్ రెడ్డిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మరణించాడు.

also read:వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వేగవంతం.. పులివెందులలో ఆ ప్రాంతాలను పరిశీలించిన సీబీఐ బృందం..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు, నిందితుడు అనుమానాస్పదస్థితిలో మరణించడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐపై ఆరోపణలు చేసిన గంగాధర్ రెడ్డి మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోనే అనుమానాస్పదస్థితిలో గంగాధర్ రెడ్డి మరణించాడు. గంగాధర్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే మరణానికి కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించనున్నారు.
.


 

click me!