కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ నెల 28వ తేదీన విచారణకు రావాలని అవినాష్ రెడ్డిని ఆ నోటీసులో సీబీఐ కోరింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బుధవారం నాడు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన విచారణకు హజరు కావాలని ఆ నోటీసులో సీబీఐ పేర్కొంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు రావాలని ఈ నెల 23న అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు అందించారు. ఈ నెల 24న విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో ఈ నెల 24న విచారణకు రావడం సాధ్యం కాదని సీబీఐకి వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. దీంతో నిన్న విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కాలేదు. వైఎస్ అవినాష్ రెడ్డి వినతి మేరకు ఇవాళ మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 28న విచారణకు రావాలని కోరింది. ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయ సిబ్బందికి సీబీఐ అధికారులు నోటీసులు అందించారు.
2019 మార్చి 19వ తేదీన రాత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి , దస్తగిరి, సునీల్ యాదవ్ తదితరులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో కొందరు బెయిల్ పై విడుదలయ్యారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు. బెంగుళూరుకు చెందిన ల్యాండ్ సెటిల్ మెంట్ లో వచ్చిన డబ్బుల పంపకంలో తేడా వల్లే హత్య జరిగిందని దస్తగిరి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు అందించారు.
undefined
also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: రేపు విచారణకు రావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
ఈ కేసును సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నా కూడా ఇంకా నిందితులు ఎవరో స్పష్టంగా గుర్తించలేదని వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి సీబీఐ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ వేగవంతమైంది. మరో వైపు ఈ కేసును ఏపీలో విచారణ చేయడం వల్ల ఉపయోగం లేదని సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన ఉన్నత న్యాయస్థానం తెలంగాణకు బదిలీ చేసింది. హైద్రాబాద్ లో ఉన్న ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారించనుంది. ఈ హత్యకేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను నిన్న కడప నుండి హైద్రాబాద్ సీబీఐ కోర్టుకు తరలించారు.