
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు విచారణకు రావాల్సిందిగా అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు వాయిదా వేసింది. అయితే అవినాష్ రెడ్డిని మధ్యాహ్నం 3 గంటలకే విచారణకు రమ్మని సీబీఐ కోరిందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే అవినాష్ విచారణపై సాయంత్రం 5 గంటల వరకు ఆగుతామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
Also Read: వారందరితో వైఎస్ వివేకాకు అక్రమ సంబంధాలు.. బెయిల్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి సంచలనం..
ఇదిలా ఉంటే.. అవినాష్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు జస్టిస్ సురేందర్ విచారణ చేపట్టనుంది. అయితే ఇందులో తన వాదనలు కూడా వినాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సునీత ఇంప్లీడ్ పిటిషన్‌ను కోర్టు అనుమతిస్తుందా? లేదా? అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక, సీబీఐ విచారణ నేపథ్యంలో.. వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు పులివెందుల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న అవినాష్ రెడ్డి.. సాయంత్రం 5 గంటల తర్వాత సీబీఐ విచారణకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది.