కేవలం కర్రలే కాదు బుర్రలు కూడా వాడండి..: సిఐడి అధికారులకు న్యాయవాది చురకలు

Published : Apr 17, 2023, 01:46 PM IST
కేవలం కర్రలే కాదు బుర్రలు కూడా వాడండి..: సిఐడి అధికారులకు న్యాయవాది చురకలు

సారాంశం

మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంపై మాట్లాడిన లాయర్లకు సిఐడి నోటీసులు ఇవ్వడం వివాదానికి దారితీసింది. సిఐడి అధికారుల తీరును లాయర్లు ఖండిస్తున్నారు. 

విజయవాడ : మార్గదర్శి చిట్ ఫండ్ లో అవకతవకలకు పాల్పడ్డారంటూ సిఐడి  విచారణ పోలీసులు, న్యాయవాదుల మధ్య వివాదాన్ని రేపింది. విచారణ తీరును తప్పుబట్టిన న్యాయవాదులకు సిఐడి నోటీసులు జారీచేయడం ఈ వివాదానికి కారణమవుతోంది. సిఐడి నోటీసులపై మండిపడుతున్న న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు సిఐడి తీరును ఖండిస్తూ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సిఐడి నోటీసులు అందుకున్న న్యాయవాదులు  సుంకర రాజేంద్ర ప్రసాద్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... న్యాయపరమైన అంశాలపై న్యాయవాదులుగా మాట్లాడితే  తప్పేంటని సిఐడి అధికారులను ప్రశ్నించారు. కేసు‌ విచారణలో పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే తాము కోరామన్నారు. పత్రికలు, మీడియాలో మాట్లాడితేనే సిఐడి అధికారులు భయపడుతున్నారని అన్నారు. 

65 సంవత్సరాలు‌ పైబడిన వృద్దులు, 15 ఏళ్ళలోపు మైనర్లు, మహిళలను విచారణకు పిలవకూడదని కోర్టు చెప్పిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ముందు కోర్టుల ఆదేశాలు, సెక్షన్ల గురించి తెలుసుకుని సిఐడీ అధికారులు వ్యవహరించాలని సూచించారు. కేవలం కర్రలే కాదు బుర్రలు ఉపయోగించి పని‌ చేయాలంటూ చురకలు అంటించారు. కనీసం ఇప్పటినుండి అయినా చట్ట పరిధిలో పని‌ చేయాలని... లేదంటే మేము కూడా కేసులు వేసి బోనులో నిలబెడతామని సిఐడి అధికారులను హెచ్చరించారు. 

Read More జగన్ చేతిలో పకోడీలా సిఐడి...: అచ్చెన్నాయుడు సెటైర్లు

ఇప్పటికే అరెస్టయిన ఆడిటర్లకు కూడా 160 సి.ఆర్.పి నోటీసులు ఇచ్చారని... తమకు కూడా ఇప్పుడు అవే నోటీసులు ఇవ్వడం వెనుక అర్ధం ఏమిటి? అని న్యాయవాది నిలదీసారు. అసలు మేము సాక్షులమే కానప్పుడు మాకు ఎలా నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కేసును సమగ్రంగా పరిశీలించిన తమకు నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. కేవలం దురుద్దేశంతోనే ఈ నోటీసులు ఇచ్చారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 

పోలీసులను విమర్శిస్తే తమకు నోటీసులు ఇవ్వడం ఏమిటని సిఐడి అధికారులను నిలదీసారు. ప్రజాస్వామ్యంలో తమకు అభిప్రాయాలు చెప్పే స్వేచ్చ లేదా? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే తమకు నోటీసులు ‌ఇచ్చారన్నారు. కోర్టు పరిధిలో ఉందని ఏదీ మాట్లాకూడదని ఎక్కడా లేదని...సుప్రీంకోర్టు కూడా విచారణలో ఉన్న అంశంపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్ప వచ్చు అని చెప్పిందని గుర్తుచేసారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం తగదని సిఐడి అధికారులకు సూచించారు లాయర్ రాజేంద్ర ప్రసాద్.   

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నారావారిపల్లెలో అభివృద్ధిపనులు ప్రారంభించిన సీఎం| Asianet News Telugu
Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu