వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైకోర్టులో చుక్కెదురు.. ముగ్గురి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

By Sumanth KanukulaFirst Published Aug 1, 2022, 12:51 PM IST
Highlights

వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు‌లో చుక్కెదురైంది. వారి బెయిల్ పిటిన్లను హైకోర్టు కొట్టివేసింది. 

వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు‌లో చుక్కెదురైంది. వారి బెయిల్ పిటిన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.. తమకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత కూడా జైలులో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అని నిందితుల తరఫు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీట్ వేశారని.. అయినప్పటికీ నిందితులకు బెయిల్ మంజూరు చేయకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని చెప్పారు. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 

అయితే నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను సీబీఐ తరఫున వాదనలు వినిపించిన లాయర్ చెన్నకేశవులు వ్యతిరేకించారు. వారికి బెయిల్ ఇస్తే ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. సీబీఐ ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను సేకరించామని, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల నుంచి కొన్ని నివేదికల కోసం ఎదురుచూస్తుందని ఆయన తెలిపారు. హత్యలో అరెస్టయిన నిందితుల పాత్ర, ఇతరుల పాత్ర ఏపాటిదో నిరూపించేందుకు ఈ ఆధారాలు కీలకమని చెప్పారు. నిందితుల నేర చరిత్ర, సాక్షులకు బెదిరింపుల ఆధారంగా బెయిల్‌ను తిరస్కరించవచ్చని వాదనలు వినిపించారు.

ఇక, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు వివరాలతో కూడిన అదనపు అఫిడవిట్‌ను కూడా సీబీఐ దాఖలు చేసింది.వివేకానందరెడ్డి కుమార్తె  సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కూడా బెయిల్‌ను వ్యతిరేకించారు. అన్ని పక్షాల వాదనల అనంతరం కొద్ది రోజులు క్రితం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక, తాజాగా బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. 

 

click me!