మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులను వైఎస్ సునీతారెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వచ్చే వారంలో విచారణ జరపనుంది సుప్రీంకోర్టు వెరిఫికేషన్ బెంచ్. మరో వైపు ప్రతిదాదులకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ ను ఈ ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ నెల 5వ తేదీలోపుగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీలోపుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముగుస్తున్నందున జూలై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
undefined
తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇవేం ఉత్తర్వులని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
also read:వైఎస్ వివేకాహత్య కేసులో సీబీఐకిచ్చిన సమాచారం ఎలా లీకైంది: అజయ్ కల్లాం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ1 నిందితుడుగా ఉన్నాడు. గతంలో ఈ కేసును విచారించిన సిట్ సకాలంలో చార్జీషీట్ దాఖలు చేయని కారణంగా ఎర్ర గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. దీంతో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసినందున ఈ పిటిషన్ పై విచారణను కూడా తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది ఉన్నత న్యాయస్థానం. తెలంగాణ హైకోర్టులో ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 27న బెయిల్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పూర్తైన మరునాడే బెయిల్ ఇవ్వాలని సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ షరతులపై వైఎస్ సునీతా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.