జెసి ఇలాకాలో జగన్ సక్సెస్

First Published 6, Dec 2017, 7:25 AM IST
Highlights
  • జెసి బ్రదర్స్ నియోజకర్గంలో ప్రజాసంకల్పయాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

జెసి బ్రదర్స్ నియోజకర్గంలో ప్రజాసంకల్పయాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సొంత జిల్లా కడప, కర్నూలు జిల్లాల్లో కూడా ఇంత జన సమీకరణ జరగలేదేమో అనిపిస్తుంది. పైగా అనంతపురం జిల్లాలో వైసిపికి ప్రజాప్రతినిధులు కూడా లేరు. పోయిన ఎన్నికల్లో ఈ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వైసిపి గెలుచుకున్నది కేవలం రెండు మాత్రమే. అందులో కూడా ఒకరు జారిపోయారు. అటువంటిది జగన్ పాదయాత్ర జిల్లాలో మొదలైనదగ్గర నుండి జనాలు ఒకటే పోటెత్తుతున్నారు.

గుత్తి ప్రాంతంలో కూడా జనసమీకరణ బాగానే జరిగినప్పటికీ తాడిపత్రి బహిరంగసభకు హాజరైన జనాలు మాత్రం మామూలుగా లేరు. ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జి పెద్దారెడ్డి సామర్ధ్యానికి పెద్ద పరీక్షే అనుకున్నారు. నిజంగా ఇది పరీక్షే అయితే పెద్దారెడ్డి సక్సెస్ అయినట్లే. ఎందుకంటే, ఈ నియోజకవర్గంలో పార్టీలతో పనిలేకుండా దశాబ్దాల తరబడి జెసి సోదరులదే హవా నడుస్తోంది. పార్టీ తరపున పోటీ చేసినా, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినా గెలుపు మాత్రం వాళ్ళదే. తాడిపత్రిలో వారిని ఎదిరించి ఇంకోరు నిలబడటమన్నది ఊహకు కూడా అందదు.

అటువంటి నియోజకవర్గంలో వైసిపి చేసిన జనసమీకరణ మామూలు స్ధాయిలో లేదు. అయితే, ఇక్కడో విషయం చెప్పుకోవాలి. అదేంటంటే, దశాబ్దాల పాటు జెసి సోదరుల హవా నడుస్తోందంటే వారికి ధీటైన నాయకుడు అక్కడ లేకపోవటమే. అందుకే ఎన్నికేదైనా అక్కడ ఫలితం మాత్రం ఏకపక్షంగా వస్తోంది. గడచిన మూడున్నరేళ్ళలో జెసి సోదరులపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగిపోతోంది. దానికితోడు తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ పెద్దారెడ్డిని నియమించారు. దాంతో సమీకరణలు మారుతున్నాయి. పెద్దారెడ్డి ఏ విషయంలో కూడా జెసి సోదరులకు తీసిపోని నేతగా ప్రచారంలో ఉన్నాడు.

అందుకనే పెద్దారెడ్డి ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకోగానే వైసిపికి జవసత్వాలు నింపారు. దాంతో అంతుకుముందు వైసిపిని వదిలేసి వెళ్ళి పోయిన వారంతా తిరిగి పార్టీలోకి వచ్చేశారు. దాంతో పార్టీ బలంగా తయారైంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు జెసి సోదరులపై పెరుగుతున్న వ్యతిరేకత కూడా పెద్దారెడ్డికి కలిసి వచ్చింది. అందుకనే జెసి సోదరులకు వ్యతరేకంగా ఏ కార్యక్రమం చేపడుతున్నా సక్సెస్ అవుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర, బహిరంగసభలకు హాజరైన జనాలు అందులో భాగమే.

Last Updated 26, Mar 2018, 12:02 AM IST