ప్రత్యేకహోదాపై గళం వినిపించనున్న జగన్

Published : Oct 10, 2017, 08:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ప్రత్యేకహోదాపై గళం వినిపించనున్న జగన్

సారాంశం

చాలా కాలం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాపై గళం విప్పనున్నారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో మంగళవారం అనంతపురంలో జరగనున్న యువభేరి కార్యక్రమానికి జగన్ హాజరవుతున్నారు.

చాలా కాలం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాపై గళం విప్పనున్నారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో మంగళవారం అనంతపురంలో జరగనున్న యువభేరి కార్యక్రమానికి జగన్ హాజరవుతున్నారు. విభజన చట్టంలో భాగంగా ఏపికి ప్రత్యేకహోదా రావాల్సుంది. అయితే, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు విజయవంతంగా ప్రత్యేకహోదా డిమాండ్ కు సమాధి కట్టేసాయి.

దాంతో వైసీపీ ఎన్ని ఆందోళనలు చేసినా ఉపయోగం కనబడలేదు. దానికితోడు అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, టిడిపికి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, చంద్రబాబునాయుడు తదితరులు ప్రత్యేకహోదాపై వేసిన పిల్లిమొగ్గలు అందరూ చూసిందే. అందరూ కలిసే హోదా డిమాండ్ ను విజయవంతంగా నీరుకార్చేసారన్నది వాస్తవం.

కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రత్యేకహోదాకు ఘోరీ కట్టాలని నిర్ణయించుకున్నాక రాష్ట్రంలోని ప్రతిపక్షాలు (?) ఎంత మొత్తుకుంటే మాత్రం ఏం ఉపయోగం? అందుకే జగన్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు. రాష్ట్రంలోని పలు చోట్ల జగన్ యువభేరి నిర్వహించటంతో పాటు ఆందోళనలు కూడా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో మూడు బహిరంగ సభలు పెట్టారనుకోండి అది వేరే సంగతి.

ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఎంపిలతో రాజీనామా చేయిస్తానని, పార్లమెంటును స్ధంబింపచేస్తానని ఇలా..  జగన్ చాలానే చెప్పారు. సరే, ఎవరి వ్యక్తిగత అవసరాలు వారికుంటాయి కదా? అందుకనే చంద్రబాబు లాగే జగన్ కూడా మెల్లిగా హోదా డిమాండ్ పై కాడి దింపేసారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా? అందుకనే జనాల్లో సెంటిమెంటుగా నిలిచిపోయిన ప్రత్యేకహోదా డిమాండ్ ను తట్టి లేపాలనుకున్నట్లుంది. అందుకనే అనంతపురంలో యువభేరి పేరుతో భారీ విద్యార్ధి సభను ఏర్పాటు చేసింది వైసీపీ. దానికి జగన్ హాజరవుతున్నారు.

సరే, ప్రత్యేకహోదా కోసం అవసరమైతే వైసీపీతో కలిసి పనిచేస్తామంటూ మొన్ననే జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ చేసిన ప్రకటన అందరికీ గుర్తుంది కదా? ఒకవేళ ముందస్తు ఎన్నికలు గనుక వస్తే బహుశా వైసీపీ, జనసేన కలిసి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తాయేమో చూడాలి. అప్పుడేమన్నా జనాల్లో కూడా చైతన్యం వస్తుందేమో? ఏదేమైనా జనాల్లో స్పందన రానంత వరకూ ఏ పార్టీ అయినా చేసేదేమీ లేదన్న విషయం మాత్రం వాస్తవం.

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu